తొర్రూరు, అక్టోబర్ 06: ధ్రువీకరణ పత్రాల జారీకి డబ్బులు తీసుకుంటున్న గ్రామపంచాయతీ అధికారిపై వేటు పడింది. హరిపిరాల, కర్కాల గ్రామాల ప్రజల నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న జీపీఓ గాదరబోయిన అచ్చయ్యను బదిలీ చేశారు. అక్రమార్జనకు తెరతీసిన జీపీ అచ్చయ్య గురించి ‘ధ్రువీకరణ పత్రాలకూ ముడుపులా ?’ అంటూ ‘నమస్తే తెలంగాణ వెబ్’లో వచ్చిన కథనంపై స్పందించిన అధికారులు ఆయనను తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేశారు. అంతేకాదు అచ్చయ్యను డిమోషన్ చేసి రికార్డు అసిస్టెంట్‌గా నియమించినట్లు మంగళవారం తహసీల్దార్ గడీల శ్రీనివాస్ తెలిపారు.
ఇటీవల హరిపిరాల, కర్కాల గ్రామస్తుల నుంచి ధ్రువీకరణ పత్రాల కోసం జీపీఓ అచ్చయ్య అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అచ్చయ్య వసూళ్లపై నమస్తే తెలంగాణ వెబ్‌లో వార్తా కథనం ప్రచురితమైంది. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. నమస్తే కథనం స్పందించిన అధికారులు ఆయనపై ప్రాథమికంగా చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ గడీల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నమస్తే తెలంగాణ వార్తా కథనాలపై స్పందించి జీపీఓ అచ్చయ్యపై ప్రాథమిక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అచ్చయ్యను తొర్రూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధాకర్‌కు అసిస్టెంట్‌గా నియమించాం. అక్రమ వసూళ్లకు సంబంధించి అచ్చయ్యపై విచారణ కొనసాగుతోంది. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తహసీల్దార్ స్పష్టం చేశారు. హరిపిరాల గ్రామ ఇన్చార్జ్ జీపీఓగా ఫతేపురం జీపీఓ లావణ్యను నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు.