Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద ఇండియా కూటమి నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ సహా కీలక నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇండియా బ్లాక్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్ నుంచి ఈసీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని భావించారు. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు, ఇతర నేతలు హాజరయ్యారు. అయితే, వీరిని ఈసీఐ భవనం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆకాశవాణి భవన్ వద్ద నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వీరిని మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాలు, పవన్ ఖేరా, అఖిలేష్ యాదవ్ వంటి నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతలు సహా కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షన తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.