రాయపోల్, అక్టోబర్ 6: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అర్హతను నిశితంగా పరిశీలించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రాయపోల్ మండలం ఆనాజీపూర్, తిమ్మక్క పల్లి, కొత్తపల్లి గ్రామలలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై ప్రత్యేక చెక్ వెరిఫికేషన్ నిర్వహించారు. మండల అధికారుల వెరిఫికేషన్ అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పింఛన్ దరఖాస్తుదారుల కుటుంబ పరిస్థితులు, అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలను మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్ పరిశీలించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు బాబు నాయక్ తెలిపారు. అనర్హులు పింఛన్ పథకం ప్రయోజనం పొందకుండా, అర్హులకు న్యాయం జరిగేలా వెరిఫికేషన్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమంలో సెక్రెటరీ పూర్ణ చందర్, నాయకులు ఇస్తారి, తదితరులు పాల్గొన్నారు.