Anakapalli | దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతోంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు వస్తున్న ఈ అపూర్వ స్పందన నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం ఘనంగా ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది.
ఈ వేడుకలో ప్రముఖ నటుడు, నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ‘అనకాపల్లి’ సినిమా ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడు విక్రమ్ ఈ చిత్రంలో నటించడం, త్రినాథరావు నక్కిన, నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. గతంలో తన ‘ఎవడిగోలవాడిదే’ సినిమాను కూడా మొదటి వారంలోనే తీసేస్తారని అన్నారని, కానీ అదే థియేటర్లో ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుందని గుర్తుచేశారు. అదేవిధంగా ‘అనకాపల్లి’ కూడా దసరా ధమాకాగా నిలుస్తుందని, సోమవారం మరియు మంగళవారం నైట్ షోలు కూడా హౌస్ ఫుల్స్ కావడం సంతోషకరమని పేర్కొంటూ నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో చిత్రం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, తాను ఈ సినిమాకు ఎలాంటి డబ్బులు పెట్టలేదని, కేవలం తన పేరుతో ప్రేక్షకులకు సినిమా చేరువవుతుందనే ఉద్దేశంతో పేరు వాడుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. సోమవారం వరకే కాకుండా మంగళవారం కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతుండటం విశేషమన్నారు. చిత్రంలోని నటీనటులందరికీ మంచి పేరు వస్తోందని, ఈ సక్సెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీడియా మరియు ప్రేక్షకులు అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు.
నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ, త్రినాథరావు నక్కిన మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను సుమారు రెండు వందల థియేటర్లలో విడుదల చేశామని తెలిపారు. తాము ఎంతో కష్టపడి మంచి సినిమాను తీశామని, అయితే ఇలాంటి మంచి చిత్రాలకు కాకుండా ఇతర భాషల చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించడం బాధాకరమన్నారు. చిన్న సినిమాలను బతికించేందుకు డిస్ట్రిబ్యూటర్లు మరిన్ని థియేటర్లు కేటాయించి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నటుడు విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ, ‘అనకాపల్లి’ సినిమాకి వస్తున్న స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. రివ్యూల ద్వారా తమకు అందిన ప్లస్, మైనస్ పాయింట్స్‌ను స్వీకరించామని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి, అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా అందించడంలో కీలకపాత్ర పోషించిన ఇంద్రజ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు దేవ్ జంద్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, నిర్మాతలు నాయుడు, రాజా గారు తమ కుటుంబ సభ్యుల్లా మారిపోయారని చెప్పారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని, అసలు సిసలు విజయం సాధించినందుకే తాను ఈ థాంక్యూ మీట్‌కు వచ్చానని తెలిపారు. అయితే, ఇంత మంచి చిత్రానికి సరిపడా థియేటర్లు ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలో ఎవరున్నారు అని కాకుండా, కంటెంట్ బాగుందా లేదా అనేదే చూస్తున్నారని, త్వరలో ఓటీటీలో వచ్చినా చూసినప్పటికీ థియేటర్ మిస్సయ్యామనే ఫీల్ కలుగుతుందని ఆమె సినిమా గొప్పతనాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ మరియు శివ మాట్లాడుతూ, ‘అనకాపల్లి’ చిత్రం రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటూ ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ప్రైజింగ్గా ఉన్నాయని ప్రశంసించారు. విక్రమ్ నటన అద్భుతంగా ఉందని, శ్రీధర్ గారి సినిమా ప్యాషన్ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ ఇలాంటి మంచి చిత్రాలు, నిర్మాతలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.