సూర్యాపేట/కోదాడ, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ హత్య ముమ్మాటికీ రాజకీయ వత్తిళ్లవల్లే జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను అభాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే రాజేశ్ హత్య జరిగిందన్నారు. కోదాడలో ఇటీవల హత్యకు గురైన రాజేశ్ కుటుంబాన్ని గురువారం కేటీఆర్, మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెంది న మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా రాజేస్ తల్లి లలితమ్మతో కేటీఆర్ దాదాపు అరగంటపాటు మా ట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరులో మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ స్టేషన్లో మరణిస్తే వెంటనే స్పందించిన నాటి సీఎం కేసీఆర్ ముగ్గురు పోలీసు అధికారులను డిస్మిస్ చేయడంతో పాటు కేవలం నెల రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబానికి రూ.35 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఒకరికి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కోదాడలో నాలుగు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు.
ఇందుకు కారణం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డేనని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి కోదాడ, హుజూర్‌నగర్‌కు పల్లెవెలుగు బస్సులా హెలికాప్టర్‌ను వాడుతున్న ఉత్తమ్‌కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే సమయం దొరకక పోవడంపై దళితులపై ఆయనకు ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ కూడా అనేక సార్లు వచ్చి ఉద్యమించారని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు.
రాజేశ్ కుటుంబానికి రూ.5 వేల పెన్షన్, స్థలం చూపితే 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం వచ్చాయని, అవి కూడా ప్రభుత్వం నుంచి రాలేదన్నారు. దళిత కుటుంబాలకు అట్రాసిటీ కేసు ద్వారా వచ్చినవే తప్ప ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. గతం లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మరియమ్మ కేసులో.. వివాహమైనప్పటికీ ఆమె ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షలు, అబ్బాయికి 15లక్షలు, ఇల్లు, ఉద్యోగంతో పాటు ముగ్గురు పోలీసు అధికారులను డిస్మిస్ చేశామని గుర్తు చేశారు.
కానీ కోదాడలో మాత్రం ఒకరిని మాత్రమే సస్పెండ్ చేశారని, డీఎస్పీకి మంత్రి ఉత్తమ్ ప్రమోషన్ ఇచ్చి తన శాఖలో పెట్టుకున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. మరియమ్మ కేసులో ఎలా చేశారో ఇక్కడ అలాగే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ఉద్యమించారన్నారు. రాజేశ్ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాజేష్ హత్యపై అసెంబ్లీ, శాసనమండలిలో నిలదీస్తామని, అవసరమైతే ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వెళ్తామన్నారు.
ఐదు లక్షల ఆర్థిక సాయం..
మృతి చెందిన రాజేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని త్వరలో మాజీ ఎమ్మెల్యే బొల్లం ద్వారా పంపిస్తామని రాజేశ్ తల్లి లలితమ్మకు కేటీఆర్ హామీ ఇచ్చా రు. అమ్మను చూస్తే బాధనిపిస్తోందని, ఇద్దరు కుమారుల్లో ఒకరిని చిత్ర హింసలకు గురి చేసి హత్య చేస్తే ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా ఉం టుందన్నారు. బాధిత కుటుంబం తరఫున మంద కృష్ణమాదిగ అండగా ఉండి ఉద్యమించినందుకు ఆయనకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాజేష్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పోలీసులను డిస్మిస్ చేసే వరకు శాంతించే ప్రసక్తే లేదన్నారు.
రీ పోస్టుమార్టం రిజల్ట్ చూసి ఈ కేసు అయ్యే దాకా జగదీశ్‌రెడ్డి, బొల్లం అండగా ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకుడు బెజవాడ శ్రవణ్ అందజేసిన రూ.50 వేల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ తన చేతుల మీదుగా రాజేశ్ తల్లికి అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కం చర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ఏపూరి రాజు, నాయకులు నరేశ్ మాదిగ, కొం డపల్లి ఆంజనేయులు, బచ్చలకూరి వెంకటేశ్వ ర్లు, మరికొందరు కేటీఆర్‌ను కలిసి రాజేశ్ హ త్య తీరుతెన్నులను వివరించి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.