– పదవీ విరమణ సందర్భంగా ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల ఘన సన్మానం
రుద్రంపూర్, జూలై 30 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విశిష్ట సేవలందించి శుక్రవారం పదవీ విరమణ పొందనున్న ఎం.శాలెం రాజును ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గురువారం ఏరియా ఎస్అండ్పీసీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ అధికారి అభిలాష్ మాట్లాడుతూ.. సింగరేణిలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెం ఏరియా ఎస్అండ్పీసీ కార్యాలయంలో ఫీడర్ క్యాంటీన్ ఏర్పాటు కావడం శాలెం రాజు చొరవతోనే సాధ్యమైందని తెలిపారు. అలాగే ఏరియాలోని వివిధ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి పరిష్కరించేవారని, సిబ్బంది మనోధైర్యాన్ని పెంపొందించేలా ఎల్లప్పుడూ అండగా నిలిచారని అన్నారు. చాతకొండ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల సింగరేణి భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుని తిరిగి సంస్థ స్వాధీనంలోకి తీసుకురావడంలో శాలెం రాజు చూపిన చొరవ, ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు.
అంతేకాకుండా సింగరేణి భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు, ఉత్పత్తి, ఉత్పాదకతకు ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేస్తూ కొత్తగూడెం ఏరియాను ముందంజలో నిలిపారని అభిలాష్ పేర్కొన్నారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన ఆయన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలోఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ,ఐ ఎన్ టి యు సి ఏరియా ప్రెసిడెంట్ రజాక్ , ఏఐటిసి అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఎస్ ఓ టు జి ఎం ఎం. గోవిందరావు,జూనియర్ ఇన్స్పెక్టర్ కామరాజు ఫిట్ సెక్రటరీలు మోహన్ రెడ్డి, మల్లికార్జున్, ఫంక్షన్ కమిటీ ఆర్గనైజర్ హానోకు రాజు షిఫ్ట్ జమేధర్స్ విక్టర్, కమల్ సింగ్, సీనియర్ సెక్యూరిటీ గార్డ్స్ జనార్ధన్ ,గౌస్ సుధాకర్ ,సంపత్ ,విజయ్, కుమార్ ,డేవిడ్ ,వెంకట్ , ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్స్ నూకరాజు ,దినేష్ ,యాదవ్ ఈశ్వర్ , ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అధికారులు పాల్గొని శాలెం రాజుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.