మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 26 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి నెలనెలా రావాల్సిన అద్దె బకాయిలు రూ. మూడు కోట్లకు పైగా పేరుకుపోగా, యంత్రాంగం వసూళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నాలుగు ప్రాంతాల్లో 88 గదులు ఉండగా, ఇందులో 29 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 59 దుకాణాలకు సంబంధించిన అద్దె ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి రూ. 12471148, పాత బకాయిలు రూ. 19265753 కలిపి మొత్తం రూ. 31736901 వసూలు చేయాల్సి ఉంది. వీటిలో ఇప్పటి వరకు ప్రస్తుత ఏడాదికి సంబంధించిన అద్దె రూ. 65808, పాత బకాయిలు రూ. 1461640 కలిపి మొత్తం రూ. 1527448 మాత్రమే వసూలు చేశారు.
ఇంకా ప్రస్తుత ఏడాదికి సంబంధించిన అద్దె రూ. 12405340, పాత బకాయిలు రూ. 17804113 కలిపి మొత్తం రూ. 30209453 వసూలు చేయాల్సి ఉన్నది. మార్కెట్ ఏరియాలో ఏ-టైప్ దుకాణాలలో ఆరింటి నుంచి రూ. 2828390, బీ-టైప్ దుకాణాలు ఎనిమిదింటి నుంచి రూ. 5440527, సీ-టైప్ ఎనిమిది దుకాణాల నుంచి రూ. 4421724, మొదటి అంతస్తు ఒక దుకాణం నుంచి రూ. 1350112, డీ-టైప్ దుకాణాలు మూడింటినుంచి నుంచి రూ. 1112764, మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న 22 ఐడీఎస్‌ఎమ్‌టీ దుకాణాల నుంచి రూ.5615772, ఐడీఎస్‌ఎమ్‌టీ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నుంచి రూ. 6123369, వాటర్ ట్యాంకు దగ్గర ఉన్న 10 దుకాణాలనుంచి రూ. 3316795 వసూలు కావాల్సి ఉంది.
సబ్లీజులే అధికం
మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్‌లలో అద్దెకు తీసుకున్న వారిలో అనేక మంది ఆ దుకాణాలను సబ్‌లీజులకు ఇచ్చారు. కార్పొరేషన్‌కు చెల్లించే అద్దె కంటే సబ్ లీజుకు తీసుకున్న వారి నుంచి రెండింతలు మొదలుకొని.. నాలుగింతల వరకూ వసూలు చేస్తున్నారు. వారి నుంచి నెలనెలా వసూలు చేసుకుంటున్న లీజుదారులు కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన అద్దెలను మాత్రం కట్టడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీకి రావాల్సిన అద్దె కోట్లలో పేరుకుపోయింది. వాటర్ ట్యాంకు దగ్గర ఉన్న ఒక దుకాణానికి సంబంధించి నెల అద్దె రూ. 10 వేలు ఉండగా, సబ్ లీజు తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో ఒక దుకాణం అద్దె రూ. 12 వేలు ఉండగా, దానిని మరో వ్యాపారీకి రూ. 35 వేలకు సబ్‌లీజు ఇచ్చారు. ఇవే కాకుండా దుకాణాల ముందు చిరువ్యాపారాలు చేసుకునే వారికి అవకాశం కల్పించి వారి నుంచి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు.