జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హస్తం నేతల హవా నడుస్తున్నది. యథేచ్ఛగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మెల్యే ఫొటో పెట్టుకొని స్థానిక కాంగ్రెస్ నేతలే అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ పనులు కానిచ్చేస్తున్నారు. తాజాగా భూపాలపల్లి పట్టణంలో పలువు రు ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా స్థానిక కాంగ్రె స్ నాయకులే ప్రొసీడింగ్‌లు ఇచ్చి, పట్టాలు పంపి ణీ చేయడమే కాకుండా ముగ్గుపోసి కొబ్బరి కాయ లు కొట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.
అధికారులు లేదా ప్రజాప్రతినిధులు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు, పట్టాలను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘించారు. దీనిపై 4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగేంధర్ కలెక్టర్ రాహుల్శర్మతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన వార్డులో కాంగ్రెస్ నేతల ఆగడాలపై కలెక్టర్‌కు విన్నవించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వార్డుల్లో గెలవడం కోసం ఇందిరమ్మ ఇండ్లను ఆఫర్ చేశారు. స్వయంగా జాబితాలో మీ పేర్లున్నాయని నమ్మించారు. అధిక శాతం వార్డుల్లో కాంగ్రెస్ నేతల మాటలు నమ్మిన ఓటర్లు హస్తంవైపు మొగ్గు చూపారు.
తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక పలు వార్డుల్లో ఓడిపోయిన అభ్యర్థులు కొందరు ఇచ్చిన మాట తప్పి, మీరు మాకు ఓటు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అధికారులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నేతలే పట్టాలు ఇస్తూ పనులు ప్రారంభిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏకంగా చెరువు శిఖం భూముల్లో సైతం ముగ్గు పోస్తూ పనులు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. వారు పంపిణీ చేసే పట్టాల విషయం బాహటంగా ఫ్లెక్సీల్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది.
కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు మా వార్డులో అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మా వార్డులో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఐదుగురికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముంజాల రవీందర్ స్వయంగా ప్రొసీడింగ్ ఇచ్చి ముగ్గు పోసి పనులు ప్రారంభించాడు. మిగిలిన ఆరుగురు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని, వారి పట్టాలు నా వద్దే ఉన్నాయని, అయినా ఇవ్వనని బెదిరిస్తూ చెరువు శిఖాల్లో ముగ్గు పోస్తున్నాడు. ముస్కె రమేశ్‌కు డబుల్ బె డ్రూం ఇల్లు రాగా అతడి తల్లికి ఇందిరమ్మ ఇల్లు ఇ చ్చారు. కాంగ్రెస్ నేతలు స్వయంగా ఇందిరమ్మ ప్రొ సీడింగ్‌లు, పట్టాలు ఇస్తూ పనులు ప్రారంభిస్తున్నా రు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయమై వరుస ఆందోళనలు చేపడతాం.
– కన్నం యుగేంధర్, కౌన్సిలర్