జహీరాబాద్, సెప్టెంబర్ 3 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వదిలిపెట్టిన వరదనీటితో పంటలు మునిగి రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి మంజీరా నదిలో చేరింది. దీంతో సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ వచ్చి హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద ముంచెత్తింది.
మంజీరా నది తీర ప్రాంతంలోని ఆయా గ్రామాల రైతులు సాగుచేసిన పత్తి, కంది, మినుము పెసర పొలాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి నిలిచి పోవడంతో పూర్తిగా పాడయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా వర్షం వల్ల పంటచేలలో నీరు నిలిచి కళ్ళ ముందే పంటలు పాడయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా, బ్యాక్ వాటర్ లో మునిగి మిగిలిపోయిన పొలాల్లో ఉన్న పంటలకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా నది తీర ప్రాంతంలో బ్యాక్ వాటర్ లో దాదాపు 500 ఎకరాలకు పైగా పంటలు మునిగి పూర్తిగా దెబ్బతిని తీరని నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా బ్యాక్ వాటర్ లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.