HMDA | సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకుంటున్నారు. అయితే, ఇటీవల అధికారులే ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అసలు హెచ్ఎండీఏలో ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులే ప్రధాన ఆదాయమార్గం. గడిచిన పదేళ్లలో ఈ విభాగం ద్వారా వేల కోట్ల రూపాయల రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. దీంతోనే జాతీయ స్థాయిలో హైదరాబాద్ ప్రధాన రియల్ ఎస్టేట్ కేంద్రంగా నిలిచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియాల్టీ రంగం కుప్పకూలిపోయింది.
చేయి తడపనిదే కదలని ఫైళ్లు..!
నిజానికి గడిచిన ఐదారేళ్లలో హెచ్ఎండీలో ప్రతి పనికి ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తుల ప్రక్రియ సాగేది. చివరకు హెచ్ఎండీఏ ఇచ్చే ఎన్ఓసీ కూడా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం అందుబాటులో ఉంది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతల అనుచరుల ప్రమేయంతో హెచ్ఎండీఏలో సీన్ మారిపోయింది. ఏదైనా ఒక జోన్ నుంచి 3ఎకరాలకు పైగా ఉండే లే అవుట్ డెవలప్మెంట్ అనుమతుల కోసం దరఖాస్తు వచ్చిందంటే… ఆ వివరాలన్నీ సంబంధిత నేతలకు బట్వాడా అవుతున్నాయి. ఇవీ ఎలా చేరుతున్నాయనే విషయం పక్కన పెడితే… ఆ నేతల ప్రమేయం ఇక్కడే మొదలవుతుంది.
నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు ఉన్నా.. డీవియేషన్ లేకున్నా నేతల చేయి తడిపితే గానీ ఫైల్‌కు మోక్షం కలగడం లేదనే ఆరోపణలున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ విస్తరించిన ఓ జోన్ పరిధిలో హైరైజ్ భవనానికి వచ్చిన దరఖాస్తు అనివార్యంగా చదరపు అడుగుకు ఫీజు చెప్పినట్లుగా సమాచారం. చివరకు ఆరు నెలలు గడిస్తే గానీ ఆ ఫైల్ ఎంఎస్బీ సమావేశానికి కూడా రాలేదని తెలిసింది. ఇలా చేపట్టే ప్రాజెక్టుకు విస్తీర్ణాన్ని బట్టి అనుచరులు పన్నులు వసూలు చేస్తుంటే, సాధారణ ఉద్యోగులు ఏమీ చేయలేని పరిస్థితి.
సీఎం వార్నింగ్ ఎవరికి?
అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో అధికారులను నేరుగా హెచ్చరించారు. పనితీరు మార్చుకోని అధికారుల వివరాలు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైస్థాయి నుంచి పైరవీలతో వచ్చే దరఖాస్తులను తామెలా ఆపుతామంటూ అధికారులే నిట్టూరుస్తున్నారంటే.. ఇంతకీ ఎవరికీ ఈ వార్నింగ్ అనేది అంతు చిక్కడం లేదు. అనుచరులు చెప్పిన దరఖాస్తులను పట్టించుకోని అధికారులను హెచ్చరిస్తున్నారా? లేక అధికారులందరూ చెప్పిందే చేయాలని ఆదేశిస్తున్నారా? అంటూ హెచ్ఎండీఏ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏం చేయాలో తోచని పరిస్థితలో ఉద్యోగులు ఉన్నారు.
తేలిపోయిన కమిషనర్ మాటలు..
హెచ్ఎండీఏ పరిధిలో నిర్మాణ రంగంలో ఏమాత్రం ఇబ్బందులు లేవని, ఆదాయం, నిర్మాణ అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగిందంటూ హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల ఓ నివేదిక విడుదల చేశారు. అంతలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అనుమతులు ఎందుకు రావడం లేదంటూ కమిషనర్ ఎదుటే ప్రస్తావించడంతో అసలు ఆ నివేదికనే అవాస్తవమని తేలిపోయింది. ఇప్పటికీ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందంటే ముఖ్య నేత అనుచరులే కారణమని వ్యాపారులే స్వయంగా చెబుతున్నారు. కానీ హెచ్ఎండీఏ పరిధిలో పాలన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవంటూ ఉన్నతాధికారులు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదని మరోసారి రుజువైంది.
సీఎల్‌యూ మరీ దారుణం…
హెచ్ఎండీఏ పరిధిలో వందలాది ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ దరఖాస్తులు వస్తుంటాయి. కానీ వీటిలో అనుమతులు వచ్చేవి మాత్రం కొన్నింటికే. ఇప్పటికీ వందలాది దరఖాస్తులు గడిచిన ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. హెచ్ఎండీఏలో అన్ని దశలు ముగించుకుని పురపాలక శాఖకు చేరినా.. అక్కడ అనుమతి రావాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇక అధికారులే ఎవరితోనైనా చెప్పించుకోవాలంటూ దరఖాస్తుదారులకు చేసే సూచనలు, సెక్రటరీ వద్ద పెండింగ్‌లో ఉన్న వందలాది దరఖాస్తులే హెచ్ఎండీఏ, పురపాలక శాఖ పాలన తీరుకు అద్దం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యథేచ్ఛగా చెరువు భూములను గృహావసరాలకు మార్చినా పట్టించుకోకుండా అనుచరులు సంతకం పెడితే… ఫైల్‌కు రాజమార్గాన్ని పురపాలక శాఖ అధికారులు ఏర్పాటు చేసి మరీ అనుమతులు ఇచ్చిన సందర్భాలు గడిచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి.