Donald Trump | ట్రంప్ మరణించారా? ఆయనకు ఏమైంది? ఆయన ఆరోగ్యంగా లేరా? ఇలా అమెరికా అధ్యక్షుడు అనారోగ్యంగా ఉన్నారని సోషల్‌మీడియాలో ఇటీవల రకరకాల ప్రచారాలు జరిగాయి. కొద్దిరోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకుండా ఉండటంతో తీవ్ర సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయయి. పైగా ఆయన కుడిచేతిపై గాయాలతో కనిపించడం ఈ అనుమానాలను మరింత పెంచింది. వీటన్నింటిపై తాజాగా ట్రంప్ స్పందించారు. తాజాగా ఓవల్ ఆఫీసులో మీడియా ముందుకొచ్చిన ఆయన.. వాటన్నింటినీ ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు.
చాలా రోజుల తర్వాత మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చిన ట్రంప్‌ను కొంతమంది రిపోర్టర్లు ఆయన ఆరోగ్యంపై ప్రశ్నించారు. ‘ మీరు చనిపోయారని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి.’ వాటి గురించి తెలుసా అని అడిగారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. అవునా, నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయా? నాకు తెలియదు అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అవన్నీ వట్టి పుకార్లే అని క్లారిటీ ఇచ్చారు. ఈ వీకెండ్లో చాలా ఆరోగ్యంగా ఉన్నానని, వర్జీనియా గోల్ప్ క్లబ్లో గోల్ఫ్ ఆడానని చెప్పారు. అంతేకాదు ‘ట్రూత్’ సోషల్‌లో శనివారం నుంచి సోమవారం వరకు 90కి పైగా పోస్టులు కూడా చేశానని వివరించారు.
రెండు రోజుల పాటు తాను ఎలాంటి మీటింగ్‌లు పెట్టలేదని.. అందుకే ఇలాంటి వదంతులు వచ్చాయని పేర్కొన్నారు. గత వారంలో చాలా ప్రెస్మీట్లు పెట్టాను.. అవన్నీ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు మీటింగ్‌లు పెట్టకపోవడంతో.. ఏదో జరిగిందని అనుకున్నారని వివరించారు. ఇక గత అధ్యక్షుడు జో బైడెన్‌ను కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. బైడెన్ అయితే నెలల తరబడి పబ్లిక్ మీటింగ్‌లు పెట్టకుండా ఉండేవాడని.. అయినా ఎవరూ ఆయన ఆరోగ్యం గురించి ఏమీ అనలేదని అన్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని చెప్పారు.
Donald Trump reacts to the internet thinking that he had passed away.pic.twitter.com/ezhNAPTLVc
— Pop Base (@PopBase) September 2, 2025
డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ వైద్యులు ఇప్పటికే వివరణ ఇచ్చారు. ట్రంప్ చేతిపై కనిపిస్తున్న మచ్చకు ఆయన తీసుకుంటున్న ఆస్పిరిన్ మందే కారణమని తెలిపారు. హ్యాండ్‌షేక్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆయనకు ఆ మచ్చలు వస్తాయని.. అవి మళ్లీ మాయమవుతాయని పేర్కొన్నారు. ఇక క్రానిక్ వీనస్ ఇన్‌సఫీషియన్సీ (రక్తప్రసరణ సమస్య) కారణంగా ఆయనకు కాళ్ల వాపులు వచ్చాయని చెప్పారు.