వాషింగ్టన్: ఇరాన్‌కు కీలకమైన ఖార్గ్ దీవిలోని మిలిటరీ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలోనే హోర్ముజ్ జలసంధి నుంచి చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం ఎస్కార్ట్‌గా వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రుత్ సోషల్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. ఇరాన్‌కు చెందిన ముడి చమురును దాదాపు 90 శాతం వరకు ఖార్గ్ దీవి నుంచి ఎగుమతి చేస్తారు. అయితే ఆ దీవిలో ఉన్న ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై శక్తివంతమైన బాంబులతో దాడి చేసినట్లు ట్రంప్ చెప్పారు. వాస్తవానికి ఆ దీవిని టార్గెట్ చేయాలని తాము ఏమీ అనుకోలేదని, కానీ చివరి క్షణాల్లో ఆ దీవిని నిర్మూలించామన్నారు. కానీ దీవిలో ఉన్న ఇంధన కేంద్రాలను మాత్రం ధ్వంసం చేయలేదన్నారు.
ఒకవేళ హోర్ముజ్ జలసంధి నుంచి నౌకలను స్వేచ్ఛగా వెళ్లనివ్వకుంటే, అప్పుడు తక్షణమే ఆ కేంద్రాలపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము దాడి చేయాలనుకున్న ప్రదేశాన్ని రక్షించుకునే శక్తి ఇరాన్‌కు లేదని ఆయన అన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని పొందలేదని, అమెరికాను కానీ.. లేక పశ్చిమాసియా దేశాలను కానీ అది బెదిరించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. హోర్ముజ్ జలసంధి నుంచి ఎప్పుడు ఇంధన నౌకలకు అమెరికా ఎస్కార్ట్ కల్పిందని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. త్వరలోనే ఆ పని జరుగుతుందన్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడుల వల్ల హోర్ముజ్ జలసంధిలో వేల సంఖ్యలో ఇంధన నౌకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
ఖార్గ్ దీవి సైజులో చాలా చిన్నది. ఇరాన్ తీరానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఆ దీవి ఉన్నది. సుమారు అయిదు మైళ్ల విస్తీర్ణంలో ఆ దీవి ఉంది. అయితే ఇరాన్ ఇంధన సరఫరాకు ఈ దీవిని జీవనాడిగా చెబుతారు. ఈ దీవిలో నివాస ప్రాంతాలు తక్కువే. కానీ ఇరాన్‌కు చెందిన సుమారు 90 శాతం క్రూడాయిల్ ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. భారీ ట్యాంకుల్లో ఇంధనాన్ని ఈ దీవికి తరలిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి పెర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి నుంచి ఇంధన నౌకలు చైనాకు వెళ్తాయి.
ఇరాన్ ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశం చైనా కావడం గమనార్హం. ఒకవేళ ఈ దీవికి యాక్సిస్‌ను తొలగిస్తే అప్పుడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. వాస్తవానికి తొలుత సైనిక బలగాలు ఆ దీవిని స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఖార్గ్ దీవిని ఇంధన సరఫరాకు కీలకమైన టర్మినల్‌గా ఇరాన్ వాడుతోంది. ఆయిల్ రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చుతారు. ఇక ఆయిల్ టర్మినల్స్లో ఆ పెట్రోలియం ఉత్పత్తులను స్టోర్ చేసి సరఫరా చేస్తారు.