పటాన్చెరు, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్, బీజేపీల కుట్రతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చారని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూతికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే మోడల్‌గా నిలిచిందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కనుసన్నుల్లో సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని మూసి వేయడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీబీఐ విచారణకు కుట్ర చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , బీఆర్ఎస్ను బద్నాం చేసే పని పెట్టుకున్నదని ఆరోపించారు. కాళేశ్వరం జలాలు తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు కాళేశ్వరాన్ని బలికానివ్వమన్నారు.
తెలంగాణ నీటి వనరులను సంరక్షించకుండా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, నాయకులు కొలన్ బాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అంజయ్య, వెంకటేశంగౌడ్, మాణిక్‌యాదవ్, సురేందర్‌గౌడ్, సాయికిరణ్‌రెడ్డి, బీరప్పయాదవ్, శ్రీకాంత్ యాదవ్, రత్నం, కృష్ణయాదవ్, యాదగిరి పాల్గొన్నారు.