తెలంగాణ విద్యా కమిషన్ ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సిఫారసులు చేసింది. సంస్కరణల పేరుమీద సంస్కారం లోపించిన సలహాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 300 పాఠశాలల్లో అధ్యయనం చేశామని చెప్తున్న కమిషన్ పెద్దలు.. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’ నివేదికను రూపొందించారు. నివేదికలోని 434 సిఫారసులలో చాలావరకు అసంబద్ధంగా, ఆచరణసాధ్యంకాని విధంగానే ఉన్నాయి. కమిషన్ పెద్దలు ముఖ్యమంత్రి ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చినట్టు అవగతం అవుతున్నది.
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు. సమాజానికి అవసరమైన మానవ వనరులను తయారు చేసే ఒక వ్యవస్థ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే రూపశిల్పులు. సమాజంలోని అనేక వృత్తుల వారిని ఉత్పత్తి చేసేవారు ఉపాధ్యాయులు. కానీ అలాంటి కీలక హోదా గల గురువులను తయారు చేయాలన్నా కూడా ఉపాధ్యాయులకే సాధ్యం. ఉపాధ్యాయులు నిర్వహించే పని ఈ సమాజంలో ఎవరూ నిర్వహించలేరు. అలాంటి టీచర్లకు పదోన్నతులు ఇవ్వవద్దంటూ విద్యా కమిషన్ చేసిన సిఫార్సులు ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. రెగ్యులర్ టీచర్లు వద్దట.. కాంట్రాక్టు టీచర్లే ఉండాలట. కాంట్రాక్టు పద్ధతిలో అభద్రతాభావంతో పనిచేసేవారు.. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించగలరా? సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తున్న పదోన్నతులు వద్దంటూ చేసిన సిఫారసు కూడా ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. ప్రత్యక్ష నియామకంలో ప్రధానోపాధ్యాయులను నియమించాలని సూచించడం, సీనియర్ టీచర్లు అవసరం లేదని చెప్పడం అశాస్త్రీయమే. అనుభవం లేని వారిని కీలక పోస్టుల్లో భర్తీ చేయాలని సూచించడం అంగీకారయోగ్యం కాదు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సంవత్సరానికి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలి ప్రైవేటు బడుల్లో చేరుతున్నారు. ఈ అంశంపై పాలకులు కనీసం సమీక్ష నిర్వహించడంలేదు. విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు మొగ్గు చూపడం విద్యాశాఖ వైఫల్యమే. ఇక కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి గత ప్రభుత్వం ప్రోత్సహించిన గురుకులాలు నచ్చలేదు. పిడికెడు మంది కోసం అన్ని వేల కోట్ల ఖర్చు అవసరమా అని విమర్శించడం మనం మర్చిపోలేదు. పేదల పిల్లల చదువు పట్ల ఆయన దృక్పథమది. మరి రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట చేస్తున్న ప్రతిపాదన ఆయనకు ఎందుకు నచ్చిందో! ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.200 కోట్లు ఖర్చు పెడుతామని చెప్తున్న మాట ఎలా నచ్చిందో? ఇందులో 2500 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 119 నియోజకవర్గాలలో కనీసం మూడు లక్షల మంది విద్యార్థులకు మించి విద్య అభ్యసించే సౌకర్యం లేదు. అంటే రూ.20 వేల కోట్లతో మూడు లక్షల మంది చదవడం పట్ల కమిషన్ సందృప్తిగా ఉన్నదా? మరి 6 లక్షల మంది విద్యార్థులు రూ.1000 కోట్లతో చదవడం ఆకునూరి మురళికి ఎందుకు నచ్చలేదు?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నిటి రూపురేఖలను రూ.1000 కోట్ల నిధులతో మార్చేయవచ్చని కమిషన్ నివేదికలో పేర్కొన్నది. ఇప్పటికే 29 రకాల పాఠశాలలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మరి కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను నెలకొల్పాలని ఎలా చెప్పినట్టు? వీటివల్ల ఆ ప్రాంతంలో ఇంత కాలంగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మూతపడే రోజులు వస్తాయేమో! అంటే 2000 పబ్లిక్ స్కూల్స్ 27 వేల పాఠశాలలకు చెక్ పెట్టబోతున్నాయా?
ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీష్ మాధ్యమం నేటి పరిస్థితుల్లో వాంఛనీయమే. కానీ అది బలవంతంగా రుద్దకూడదు. మాతృభాష మృతభాషగా మారడం ప్రమాదకరం. ఇంట్లో, చుట్టుపక్కల సమాజంలో మాట్లాడే భాషను చిన్నచూపు చూడడం మంచిది కాదు. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో విద్యార్థులకు మాతృభాషలోనే బోధన జరుగుతున్నది. ప్రపంచంలో వారేమీ వెనుకబడి లేరు. పబ్లిక్ పరీక్షల్లో పాస్ మార్కులు 35 నుంచి 45కు పెంచాలని సూచించడం వల్ల సగటు లేదా అంతకు తక్కువ ఉన్న విద్యార్థులు మానసిక ధైర్యం కోల్పోతారు.
ఇక ఇంటర్ విద్యను సెకండరీ విద్యలో భాగం చేయాలన్న సూచన మరీదారుణం. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? దేశంలో మన ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత ప్రభావవంతంగా నడుస్తున్నది. మంచి సిలబస్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నది. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఐఐటీ, మెడిసిన్ ఇంజినీరింగ్ సీట్లు సాధిస్తున్నది. ఇప్పుడు దాని స్వయం ప్రతిపత్తిని హరిస్తే అది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుంది. ఇంటర్లో మార్కుల ప్రాతిపదికన ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ సీట్లు కేటాయించాలని చెప్పడం పూర్తిగా అశాస్త్రీయం. మార్కులను బట్టి ఎప్‌సెట్ సీట్ల కేటాయింపు జరిగితే ప్రైవేట్ జూనియర్ కళాశాలల దందాకు అవకాశం ఇచచ్చినట్టే. మార్కుల పోటీలో బట్టీ చదువులను ప్రోత్సహించడం అనర్థదాయకం. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దారుణంగా పడిపోతాయి. గతంలో ఇంటర్ మార్కులకు కొంత వెయిటేజీ ఇచ్చినప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడడం గమనించాలి.
గురుకుల డిగ్రీ కళాశాలలు ఎత్తివేయాలని విద్యా కమిషన్ నివేదికలో సిఫారసు చేయడం కూడా అసంబద్ధమే. వీటిలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో మంచి ర్యాంకులు, ఫలితాలు సాధిస్తున్నారు. గురుకులాల్లో ఉన్నత విద్యార్హతలతో ఎంపికైన అధ్యాపకులు ఇచ్చే నాణ్యమైన విద్యతో పాటుగా ప్రయోగశాలల అనుభవం కూడా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్నది. ఇక ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేయాలని చెప్పడం సబబుకాదు. 20 ఏండ్ల క్రితం మొదలైన ఈ పథకం వల్ల లక్షలాదిమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయిలో స్థిరపడ్డారు. కొందరు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పథకం రద్దు చేయాలని సూచించడం వల్ల ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు పేదవారికి దూరమవుతాయి.
విద్య ఒక నిరంతర ప్రక్రియ. ఒక రాత్రిలో సాధ్యమయ్యేది కాదు. మీట నొక్కితే వచ్చేది అంతకన్నా కాదు. ఆకు నూరి పసరు పోస్తే అబ్బేది కాదు. విద్య యాంత్రికమైనది అసలే కాదు. తరగతి గదిలో జరగవలసిన బోధన అభ్యసనం సాఫీగా జరిగేటట్టు చూడాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదు. పాఠశాల సమాజంలో అంతర్భాగం. దానిపై అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. అభ్యాసన సామర్ధ్యాలు ఏ ఇద్దరికీ ఒకే తీరుగా ఉండవు. తరగతి గదిలో మేధోమథనం జరగాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రియాశీలకంగా అందులో పాల్గొనాలి. అందుకు విద్యార్థి ఆరోగ్యం, ఆసక్తి, గృహ పరిస్థితులు, తల్లిదండ్రుల శ్రద్ధ అన్నీ అనుకూలించాలి.
మానవీయకోణం గల పౌరులు సంస్కారం గల సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. విలువలతో కూడిన విద్య ద్వారానే అది సాధ్యమవుతుంది. నైపుణ్యాలు, వృత్తి విద్యలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కోర్సులు ప్రవేశపెట్టాలి. విద్యలో ఫలితాలు మాత్రమే ప్రమాణాలను, పనితనాన్ని ప్రతిబింబించవు. పాఠశాల విద్యార్థులకు రెండేండ్లుగా నిలిచిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలి. మధ్యాహ్నం భోజనం నాణ్యతతో అందించాలి. ప్రమాణాలు పెంచితే ఫలితాలు సహజంగానే పెరుగుతాయి.
ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు చెల్లించాలి. టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎటువంటి చర్యలైనా భావితరాలకు హాని కలిగిస్తాయి. జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయని కమిషన్ పెద్దలు వాపోవడం, వాటిని తగ్గించాలని నివేదించడం దారుణం. పదోన్నతుల అవకాశాలు తొలగించాలని సిఫారసు చేయడం మరీ ఘోరం. ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బ తీయొద్దు. విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కసరత్తు చేయాల్సిన కమిషన్.. నిర్వీర్యం చేసేందుకు మార్గాలు అన్వేషించినట్టుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నివేదికలోని సిఫారసులను అమలు చేస్తే విద్యావ్యవస్థకు నష్టం తప్పదు. అప్పుడు పాలకులు మేల్కొని ఏం చేసినా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది.
– శ్రీశ్రీ కుమార్