సిద్దిపేట, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెదవాగు నుంచి ఇసుక దందా జోరుగా కొనసాగుతున్నది. మోయతుమ్మెద వాగు“మాయ”తుమ్మెద వాగుగా మారింది .ఇందిరమ్మ ఇండ్ల టోకెన్ల మాటున వందల ట్రిప్పుల ఇసుకను బయటకు తరలిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆకునూరు, ధూళిమిట్ట, జాలపల్లి, ఖాత, ఘనపూర్, అక్కెనపల్లి, బస్వాపూర్ తదితర గ్రామాల మీదుగా వెళ్లే ఈ వాగు నుంచి నిత్యం వందల కొద్ది ట్రాక్టర్ల ఇసుక తోడేసి డంపులు ఏర్పాటు చేస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా సిండికేట్ అయి రెవెన్యూ అధికారుల అండతో ఇసుక డంపులను తక్కువ ధరకు దక్కించుకొని ..ఆ డంపులచాటున వందల ట్రిప్పుల ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు.అధికారులకు మాముళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీరి అండదండలతో అక్రమార్కులు లక్షలు సంపాదిస్తున్నారు. దొమ్మాట, ఆకునూరు శివారు రుద్రాయిపల్లి వాగుల నుంచి ఎక్కడికక్కడ ఇసుకను తోడేసి గుట్టలు..గుట్టలుగా డంపులు ఏర్పాటు చేసి అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెవె న్యూ అధికారులు, ట్రాక్టర్ యజమానులు కలిసి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇష్టారీతిగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల టోకెన్లు పక్కదారి
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కోసం రెవెన్యూ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు పక్కదారి పడుతున్నాయి. రెవెన్యూ అధికారులు ఒక ట్రాక్టర్కు మూడు ట్రిప్పుల ఇసుక టోకెన్ ఇస్తే దానిని అడ్డుపెట్టుకొని 30 ట్రిప్పుల వరకు ఇసుక తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ఇల్లు కట్టుకునే స్థలాల్లో ఇసుక పోసి అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతి పేరిటి తరలించిన ఇసుకను అంతా వ్యవసాయబావుల వద్ద డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఏర్పాటు చేసుకున్న డంపులను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెవె న్యూ అధికారికి సమాచారం ఇస్తారు.
అనుకున్న ప్లాన్ ప్రకారం రెవెన్యూ అధికారి ఆయా డంపులను పరిశీలించి వేలంపాట నిర్ణయిస్తాడు. ఆ వేలం పాట తక్కువ ఉండే విధంగా ముందే ఆట్రాక్టర్ యజమానులు ఒక్కటి అవుతారు. ఇలా డంపులను వేలం పాట వేయించుకున్న తర్వాత ఆ ఇసుకను బయటకు తరలిస్తారు.ఒక్కో వేలం పాటలో 50 ట్రిప్పుల ఇసుక ఉంటే దానిని అడ్డుపెట్టుకొని 200 ట్రిప్పులకు పైగా ఇసుకను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.వేలం పాటలోనూ, టోకెన్ల జారీలోనూ రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్ట జెప్పుతున్నారు.దీంతో ఇసుక ట్రాక్టర్ల యజమానులు చెప్పిందే ఇక్కడ వేదం అన్న తరహాలో ఇసుక వ్యాపారం నడుస్తోంది.వాగు పరీవాహక ప్రాంతంలో జోరుగా ఇసుక దందా కొనసాగడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పంటలు పండని పరిస్థితులు ఉన్నాయి.
ఇటీవల రుద్రాయిపల్లి వాగు నుంచి ఇసుక తరలించవద్దు అని రైతులు ప్రశ్నిస్తే వారిపై ట్రాక్టర్ యజమానులు ఎదురుతిరిగారు.వాగు నుంచి ఇసుక తీయవద్దని ఎవరైనా వీడియో, ఫొటోలు తీస్తే వారి పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నారని రైతులు వాపోతున్నారు. గట్టిగా మాట్లాడితే బెదిరిస్తున్నారని వాగు పరీవాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా రోజంతా నడిచే ఇసుక ట్రాక్టర్లను ఏం అనవద్దు అని మాముళ్లు తీసుకునే అధికారులు క్షేత్ర స్థాయి అధికారులకు మౌఖిక అదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. అధికారులు, ట్రాక్టర్ యజమానులు కుమ్మక్కై ఇసుక దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక మాఫియా బెదిరింపులు
సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, మద్దూరు, ధూళిమిట్ట, చేర్యాల, కోహెడ మండలాల మీదుగా వెళ్లే మోయతుమ్మెదవాగు నుంచి ఇసుక తోడేసి భారీగా డంపులు ఏర్పాటు చేసుకున్న ట్రాక్టర్ యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరికి స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండ లు పుష్కలంగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని ప్రశ్నిస్తే … ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నది.‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి .. మా రవాణాకు అడ్డు వస్తే అంతు చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
దీనిని అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చట్టం పూర్తిగా ఇసుక మాఫియాల చేతిలోకి వెళ్లిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.అక్రమ ఇసుక పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.వాగుపరీవాహక ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5వేల నుంచి రూ.6వేలు తీసుకుంటున్నారు. 20కిలోమీటర్ల లోపు అయితే రూ.9 నుంచి రూ.10 వేల వరకు..ఇలా దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. పోలీసులు, రెవె న్యూ అధికారులకు నెల నెలా మాముళ్లు ఒక ట్రాక్టర్కు నెలకు 10వేలు ఇస్తారు. ఇలా ఇసుక అక్రమ రవాణా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతున్నది.
ఇసుకపై లింగాపూర్ రైతుల సమరం
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పదిమంది రైతులు ఇసుకపై సమరం చేస్తున్నారు.భూగర్భజలాలు అడుగంటకుండా రైతులు, గ్రామస్తులు నడుంకట్టారు.తమ గ్రామ పరిధి నుంచి రవ్వంత కూడా ఇసుక తరలించడానికి వీలు లేదని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.18-03-2015లో రైతుల విజ్ఞప్తి మేరకు వాగు నుంచి ఇసుక తీయకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. లింగాపూర్ వాగు నుంచి ఇసుక తీయవద్దు, అలా తీసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆరోజు నుంచి నేటి వరకు ఈ గ్రామ శివారు నుంచి ఇసుక రవ్వ కూడా తీయడం లేదు. ఇసుకను తరలించడం వల్లభూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వాటిని కాపాడుకోవడం కోసం లింగాపూర్ రైతులు చేసిన ప్రయత్నం ఇవ్వాళ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర గ్రామాల రైతులు నడుంబిగిస్తే ఇసుక రవ్వ కూడా వాగుల నుంచి పోదు. భూగర్భజలాలు అడుగంటవు..అధిక పంటలు పండుతాయి. అందుకోసం రైతులు, గ్రామస్తులు ముం దుకు కదలాల్సిన అవసరం ఉంది.