వరంగల్, నవంబర్1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్‌కు బీఆర్ఎస్ డెడ్‌లైన్ విధించింది. మొంథా తుపాన్‌తో నష్టపోయిన ప్రతి రైతు నూ ఆదుకోకపోతే ఊరూరా ఉద్యమిస్తామని హెచ్చరించింది. తడిసిన పంటను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. నాడు కేసీఆర్ సర్కార్ కేవ లం 10 నుంచి 20శాతం తడిస్తే ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేసి రైతులను ఆదుకున్నదని, అదే నేడు పంటలన్నీ వరదపాలైందని,
ఎకరానికి రూ.25వేలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. వారం రోజుల్లో నష్టపోయిన ప్రతి రైతుకూ ఆర్థికసాయం చేయకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తిరగనీయమని హెచ్చరించింది. శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేసింది. ఈ ప్రతినిధి బృందంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.
రాజకీయాలకతీతంగా రైతులను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌కు బీఆర్ఎస్ సూచించింది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఆ తర్వాత ప్రజల అభివృద్ధి, సంక్షేమాలే పరమావధిగా నాడు కేసీఆర్ పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ ఆయా సందర్భాలను గుర్తుచేశారు.
వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే రేవంత్‌రెడ్డి రైతులకు సకాలంలో యూరియా అందివ్వక, రైతుబంధు పైసలేయక ఇబ్బందిపాలు చేశారని, కష్టాలతో సాగును నెట్టుకొస్తున్న రైతులను మొంథా తుపాన్ తీవ్రంగా దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్వటించి తీవ్రంగా నష్టపోయిన పంటల వివరాల సేకరించి, నివేదికను ప్రభుత్వానికి త్వరగా పంపాలని కలెక్టర్ల ను కోరారు. నష్టపోయిన పశుసంపద ఆధారంగా పరిహారం చెల్లించాలని, ఇండ్లు కూలిన వారినీ ఆదుకోవాలని కోరారు.వరంగల్, హనుమకొండ సిటీల్లో ధ్వంసమైన కాలనీల్లో జనజీవనం కుదుటపడేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోవడానికి కారకుడు సీఎం రేవంత్‌రెడ్డేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వానకాలం ప్రారం భం నుంచి రైతులకు సకాలంలో యూరియా అం దించి ఉంటే 20 రోజుల ముందే పంట చేతికొచ్చేదని, తుఫాన్ తీవ్రత ఉన్నా రైతులకు ఈ స్థాయిలో నష్టపోయేవారు కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ ఎట్లా నడపాలి? అందులో ఎట్లా క మాయించాలనేది ఒక్కటే తెలుసని దుయ్యబట్టారు.
జనగామ రూరల్ : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు నీటిపాలైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సన్నవడ్లకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇంకా రూ. 1200 కోట్లు చెల్లించలేదన్నారు. మక్కజొన్న ఎకరానికి 30 క్విటాళ్ల దిగుబడి వస్తుంటే ప్రభుత్వం 18 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడం సరికాదన్నారు. పత్తి, ధాన్యం, మక్కజొన్న, ఇతర పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు.
పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి భోరోసా ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. హెలీకాప్టర్‌లో వచ్చి అధికారులతో సమీక్షించిన సీఎం స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేని ప్రశ్నించారు. తుపాన్ రాకముందే అధికారులను అలర్ట్ చేసి ఉంటే ఇంత న ష్టం జరిగేది కాదన్నారు. పంట ఏదైనా ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. భీమదేవరపల్లి మండలంలో ధాన్యం రైతులు ఎక్కువగా నష్టపోయారని, సర్వే చేసి ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.