ఢిల్లీ: హైదరాబాద్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మరో నెల రోజులు ఆగితే సరిపోతుంది. వచ్చేనెల 13న ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ నగరంలో సందడి చేయనున్నాడు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత పర్యటనకు రానున్న మెస్సీ.. హైదరాబాద్‌కూ వస్తాడని ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్న శతధ్రు దత్తా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 12-15 మధ్య భారత్‌లో పర్యటించనున్న అతడు.. డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నాడు.
సాయంత్రం 5 గంటలకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఉండనుండగా రాత్రి 7-8:45 గంటల మధ్య గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ స్టేడియం (ఇంకా ఖరారు కాలేదు)లో ‘గోట్ కప్’లో పాల్గొంటాడని శతధ్రు వివరించారు. అర్జెంటీనా జట్టు కేరళ పర్యటన రద్దవడంతో ‘గోట్ టూర్’లో హైదరాబాద్‌ను చేర్చినట్టు తెలుస్తున్నది. దీంతో మెస్సీ పర్యటన పాన్ ఇండియా టూర్‌గా సాగనున్నది.
డిసెంబర్ 12న ఈశాన్యాన (కోల్‌కతాలో) మొదలుకాబోయే అతడి పర్యటన 13న దక్షిణాది (హైదరాబాద్)కి చేరుతుంది. అక్కడ్నుంచి 14న పశ్చిమాన (ముంబై) ఆగి.. 15న ఉత్తరాది (ఢిల్లీ)కి వెళ్లి ప్రధాని మోడీని కలవడంతో ముగియనుంది.