ఆదిలాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులతో కలిసి కొప్పుల పరామర్శించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కి దొడ్డిదారిన మున్సిపాలిటీ చైర్మన్లను కైవసం చేసుకొనేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. క్యాతనపల్లిలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచి బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి వివేక్ తన అధికారాన్ని వినియోగించి పోలీసుల ద్వారా రెండుసార్లు చైర్మన్ ఎన్నిక కాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
బాల్క సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నదని ఆరోపించారు. సుమన్‌ను జైలులో ఉంచి క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికలు జరపాలని వివేక్ చూస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్‌పై కేసులు ఎత్తి వేసి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చే శారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్ దోమల బారిన పడి జ్వరంతో బాధపడుతున్నారని వెంటనే వైద్యసాయం అందించాలని కొప్పుల జైలు అధికారులను కోరారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడు తూ.. వివేక్ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. సుమన్‌ను జైలు అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని సీనియర్ న్యాయవాది కే శ్రీకాంత్ తెలిపారు.