పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు. కపాలమోక్షం వరకూ ఆ బుద్ధిలో ఏ మార్పూరాదు. అందునా శవాల ముందు డప్పుకొట్టి, విజిల్స్ వేసి, డ్యాన్సులు చేసే సరదా ఉన్నోడికి చచ్చినా మారదు. కరోనా సమయంలో శవాల లెక్కల కోసం శ్మశానాల దగ్గర కాపలా కాసిన బుద్ధి కదా?! పాపం చావు భాష, పాడె భాష.. నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ఎక్కన్నుంచో బతుకడానికి వచ్చినోడికి, ఈ గడ్డతో ఏ బంధమూ లేనోడికి.. ఇక్కడ అంతా శుభాలు జరుగాలని ఉంటదా? ఇక్కడ ప్రతివారూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఉంటదా? శతమానం భవతి అని నోటినుంచి వస్తదా? మంటిపనికైనా ఇంటివాడే కావాలనే నానుడి ఇలాంటి వాళ్లను చూసే పుట్టి ఉంటుంది.
ఇంటివాడు బతుకాలని కోరితే.. బయటి వాడు చావాలని కోరుకుంటాడు. ఈ భూమ్మీద ఎక్కడైనా ఏ దేశంలోనైనా వలసవాదుల నైజం అదే! ఈ ఉపోద్ఘాతానికి అర్హుడెవరో చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ మొత్తానికి తెలుసు. ఆ శాల్తీ బుద్ధి దిగజారి దిగజారి ఇక దిగడానికేమీ లేనంత అథఃపాతాళానికి చేరింది. ఒకసారి ఉచ్ఛం, నీచం అనేది వదిలేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా అంటగట్టేయవచ్చు. అనని మాటలు కూడా నోట్లో దూర్చేయవచ్చు. తాను కోరుకున్న మాటలు అచ్చేసి.. అది చూసి మురిసిపోవచ్చు. సరిగ్గా అంధజ్యోతి ఇదే చేసింది. ఎందుకంటే నర్సంపేట పర్యటన సందర్భంగా కేసీఆర్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. ఆయన కారు దిగడానికి కూడా పోలీస్ రక్షణ కావాల్సి వచ్చింది. ఇది అంధజ్యోతికి కంటగింపైంది.
ఏదో బురదజల్లాలి. ఏదో డైవర్షన్ చేయాలి. అందుకే కేసీఆర్ అనని మాటలను ఆయన అన్నట్టు వార్త పరిచి తన వక్రబుద్ధిని చాటుకున్నది. వాస్తవానికి జరిగిందేమిటి? కేసీఆర్ పెద్ది కుటుంబసభ్యులను ఓదార్చి దాదాపు అరగంటకు పైగా పూర్తి మౌనముద్రలో ఉన్నారు. ఉద్యమకాలపు అనుభవాలను తలచుకుంటూ.. పెద్దిని కోల్పోయిన బాధను ఎంతో కష్టమ్మీద అణచుకున్నారు. ఆ తర్వాత పెద్ది కుటుంబసభ్యులకు పార్టీ తరఫున సహాయం అందించి బయల్దేరారు. ఇదంతా అందరిముందే జరిగింది. మరి ఈ పాడెలు..చావుల మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని జన్మలంతే. ఎవరు ఛీకొట్టినా సిగ్గుపడరు. దులిపేసుకు తిరుగుతారు. పుర్రెనిండా పురుగులు చేరాక బుద్ధి అనే పదార్థం, సంస్కారం అనే ఔచిత్యం మిగులుతుందా? అవును కొన్ని జన్మలంతే!
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): విషపు రాతలు, కట్టుకథలకు కేరాఫ్ అంధజ్యోతి ప్రతినిధి. బాధాకృష్ణ నోటి నుంచి వచ్చేది ఎప్పుడూ చావు భాషే. సోయిలేని మాటలు, అబద్ధపు కథనాలు.. ఆయన దుర్మార్గపు జర్నలిజానికి నిదర్శనాలు. ఎవరూ అనని మాటలను కూడా ఆపాదించడం, తన ఎల్లో పేపర్లో పెద్దపెద్ద హెడ్డింగ్లతో రాయడం ఆయనకే సాధ్యం. ఒక పద్ధతి, పాడు లేనే లేదు. ఆయన బుద్ధికి, భావజాలానికి తగ్గట్టే ఆది నుంచి ఆయనది ‘ఎల్లో’ జర్నలిజమే. తెలంగాణకు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ బద్ధ వ్యతిరేకే. అందుకే అతనికి తెలంగాణ అంటే అస్సలు పడదు. తెలంగాణ అభివృద్ధిని అస్సలే కోరుకోడు. ఇది ఎన్నోసార్లు రుజువైనా.. తాజాగా కేసీఆర్ నల్లబెల్లి పర్యటనతో మరోసారి నిరూపితమైంది. కేసీఆర్ అనని మాటలను కూడా ఆయనే స్వయంగా పలికినట్టు కథలు అల్లి.. చావు రాతలకు తనను మించిన తింగరి లేడన్నట్టు మొదటి పేజీ వార్తా వండి వార్చాడు. దీంతో అతని బొందల రాతలపై తెలంగాణ యువత, కేసీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆ నికృష్ణపు రాతలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎల్లో జర్నలిజం వదిలేసి.. ఎల్లో కండువా కప్పుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమ సమయంలోనూ ఇవే కుట్రలు
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇవే కుట్రలు, కుతంత్రాలను వేదికైంది కూడా ఈ ‘ఎల్లో’ జర్నలిజమేని ఉద్యమకారులు అంటున్నారు. నాడు సమైక్యదారులకు నిస్సిగ్గుగా వంత పాడి.. మహోజ్వల తెలంగాణ ఉద్యమం గురించి నీచపు రాతలు ఆయనే రాశాడు. తెలంగాణ రాక తప్పదని తెలిసి కూడా చివరివరకు అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. కానీ యావత్తు తెలంగాణ.. ఆ కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని.. ఢిల్లీని గడగడలాడించి బాజాప్తా స్వరాష్ట్రాన్ని సాధించుకొన్నది. అయినా, అంధజ్యోతి పద్ధతి మారలేదు. అతను తన రోత రాతలూ మానలేదు. తెలంగాణ సాకారమైన తర్వాత కూడా విషపు రాతలు ఆగలేదు. ఉద్యమకాలం నుంచి ఇప్పటికీ ఆ కుట్రల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కేసీఆర్ కుటుంబంపై ఆయన అక్కసు పెరుగుతూనే ఉన్నది. కేసీఆర్ కుటుంబసభ్యులు అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తూ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే, బురదజల్లే అలవాటు కొనసాగిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ అడుగు బయటపెట్టిన ప్రతిసారీ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
బరితెగింపు రాతల్లో దిట్ట
తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? గులాబీ దళపతి గురించి ప్రస్తావించేటప్పుడు ఎంత ఒళ్లు దగ్గరపెట్టుకొని రాతలు రాయాలి? కానీ, అవేమీ ఒంటబట్టిచ్చుకోకుండా బరితెగింపు రాతలు రాయడంలో ఆయన దిట్ట. పెద్దదికును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేటప్పుడు కేసీఆర్ అనని మాటలను అన్నట్టుగా తన ‘ఎల్లో’ పేపర్లో ఆపాదించాడు. గులాబీ దళపతి గురించి అసత్యపు రాతలు రాసుకొచ్చాడు. ఇది బాధ్యరాహిత్యమే కాదు సభ్యత కూడా కాదని తెలంగాణ సమాజం మండిపడుతున్నది. భావోద్వేగాలతో కూడిన సందర్భంలో, బాధ్యతాయుతంగా రాయాల్సిన సమయంలో కక్షతో కూడిన విషాన్ని చిమ్మడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు.. మీరెన్ని మరణమృదంగాలు మోగించినా అవి ఘోషగానే మిగిలిపోతాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథిని, తెలంగాణ బాపుగా పిలుచుకొనే కేసీఆర్‌ను చిన్నగ చేసే చిల్లర రాతలు ఏమాత్రం సరికావని హితవు పలుకుతున్నారు. అందుకే యావత్తు తెలంగాణ సమాజం అంధజ్యోతిపై, ‘చెత్త పలుకు’లపై మండిపడుతున్నది. ఇప్పటికైనా ఈ విషపురాతలను, నికృష్టపు ఆలోచనలను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నది.
ఒక్కడే కేసీఆర్.. ఒక్క అడుగు బయటపెడితే.. ప్రత్యర్థుల గుండెలు ఝల్లుమంటయి. ఆయనకు దారివెంట వచ్చే ఆదరణ చూస్తే వారి కండ్లలో నిప్పులు పోసుకుంటరు. దారివెంట మొరిగే కుక్కలకు కొదువుండదు. వాటికి నాయకత్వం వహించడంలో రెండో వ్యక్తిగా ఉండే ఓ పత్రికా ప్రతినిధి తన బొంద రాతలతో మరోసారి చావుకూతలు కూశాడు. కేసీఆర్ నోటి వెంట పలుకని ఓ మాటను కట్టుకథగా అల్లి.. తన బాకాలతో నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు. నిలువెల్లా విషం నిండిన ఆ విలువల్లేని వ్యక్తిని తెలంగాణ సమాజం మొత్తం వాంతి చేసుకుంటున్నా కూడా.. సిగ్గూ ఎగ్గూ లేకుండా విషపు రాతలు రాస్తూనే ఉన్నడు.
‘పొద్దున లేస్తే కేసీఆర్ చావాలి అంటున్నరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను కొడుకా ఏమనుకుంటున్నవో. పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా? మరి ఈ వెధవలు కేసీఆర్ చావాలంటే, కేసీఆర్ చస్తడా? మీ దీవెన, మీ ఆశీర్వచనం ఉంటే నాకేం కాదు’
– కేసీఆర్ (ఏప్రిల్‌లో నిర్వహించిన జగిత్యాల బహిరంగసభలో..)