Cotton | మర్రిగూడ : పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి కాటన్మిల్లు దగ్గర రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరసగా మూడు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు జరగలేదని, తిండి తిప్పలు లేకుండా సీసీఐ కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు తేమశాతం పేరుతో అధికారులు పత్తిని కొనకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇప్పుడేమో రోజుకు 1200 నుంచి 1500 క్వింటాళ్ల వరకే కొంటామని చెప్పి టార్గెట్ అయిపోయిందంటూ గేటుకు తాళం వేస్తున్నారని వాపోయారు. పత్తిని తీసుకొచ్చిన వాహనాలకు వెయిటింగ్ ఛార్జీ పడటమే కాకుండా తేమశాతం కూడా పెరిగి తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు.
సీసీఐ అధికారులు నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | కొలిమిలా కొడంగల్..! సీఎం రేవంత్ తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
KTR | ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షల ఆర్థికసాయం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్