Vijay-Rashmika | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మికలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్, రష్మిక మెడలో తాళి కట్టడంతో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా పూర్తైంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం నూతన దంపతులు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వివాహ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక హృదయాన్ని తాకే సందేశాన్ని పోస్ట్ చేశారు.
హాయ్ మై లవ్స్.. నా భర్త విజయ్ దేవరకొండని పరిచయం చేస్తున్నాను అంటూ ప్రారంభించిన ఆమె, విజయ్ తన జీవితంలో ఎంత ప్రత్యేకమో భావోద్వేగంగా వివరించారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపించిన వ్యక్తి విజయ్ అని, ప్రతిరోజూ పెద్ద కలలు కనమని ప్రోత్సహించిన వ్యక్తి ఆయనేనని చెప్పారు. తనలోని పాజిటివిటీని వెలికితీసిన వ్యక్తి విజయ్ అంటూ, “నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను” అని రష్మిక పలు ఫొటోలు షేర్ చేశారు. అలానే విజయ్ దేవరకొండ కూడా భావోద్వేగ పోస్టుతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. ఆమె ఉంటే నా రోజు ఇంకా బాగుండేదని అనిపించింది. ఆమెతో ఉంటే ఎక్కడైనా ఇంటి అనుభూతి కలుగుతుందని భావించాను. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నాను. 26.02.2026” అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ పిక్స్ షేర్ చేశారు.
అయితే విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్‌కి కొద్ది గంటలలోనే 13 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, రష్మిక పోస్ట్‌కి 15 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇద్దరికి కలిపి 28 మిలియన్స్‌కి పైగానే వ్యూస్ వచ్చాయి. ఇది సరికొత్త రికార్డ్ అంటున్నారు. భారతీయ సెలబ్రిటీల వివాహ జీవితాలలో ఇదో సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు. ఇక వీరి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నూతన దంపతులు కలిసి రణబాలి అనే పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. భార్యాభర్తలుగా మారిన తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.