హైదరాబాద్ : కోదాడ పట్టణంలో లాకప్ డెత్ కేసులో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్( Karla Rajesh) మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు నేడు రీ-పోస్టుమార్టం(Re-postmortem ) చేపట్టనున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేశ్ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 104 రోజుల తరువాత రీ పోస్టుమార్టం చేస్తున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న కర్ల రాజేష్ ను పోలీసులే లాకప్ డెత్ చేశారని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రీపోస్ట్మార్టంకు ఆదేశించడం కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కర్ల రాజేష్ కుటుంబాన్ని గురువారం కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పరామర్శించారు.
రాజేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని త్వరలో మాజీ ఎమ్మెల్యే బొల్లం ద్వారా పంపిస్తామని రాజేశ్ తల్లి లలితమ్మకు కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజేష్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పోలీసులను డిస్మిస్ చేసే వరకు శాంతించే ప్రసక్తే లేదన్నారు. రీ పోస్టుమార్టం రిజల్ట్ చూసి ఈ కేసు అయ్యే దాకా జగదీశ్‌రెడ్డి, బొల్లం అండగా ఉంటారని చెప్పారు.