Raashi Khanna | సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఏ నటుడికైనా, నటికైనా ప్రత్యేకమైన అనుభవమే. అలాంటి అవకాశం దక్కిన హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే తలైవా నుంచి ఊహించని బహుమతి అందింది. రజనీకాంత్ స్వయంగా ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆమెకు కానుకగా ఇవ్వడంతో రాశీ ఖన్నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఆధ్యాత్మికత, జీవన విలువలపై ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో రజనీకాంత్ ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథం ‘Living with the Himalayan Masters’ గురించి ప్రస్తావించారు. తాను ఇప్పటివరకు ఆ పుస్తకాన్ని చదవలేదని రాశీ చెప్పగా, రెండు రోజుల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని తెప్పించి స్వయంగా ఆమెకు బహుమతిగా అందించినట్లు సమాచారం.రజనీకాంత్ నుంచి ఈ ప్రత్యేక కానుక అందుకోవడంపై రాశీ ఖన్నా సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు.ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు… నా జీవితానికి ఒక నిశ్శబ్దమైన మార్గదర్శకం అంటూ ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు పరిణతి అంటే కొత్తగా ఏదైనా సాధించడం కాదు.. మనం కాని వ్యక్తిగా నటించడం మానేసి, మన నిజమైన స్వరూపాన్ని అంగీకరించడం అనే భావాన్ని ప్రతిబింబించే కోట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. స్తకం పూర్తిగా చదివానో లేదో తర్వాత పరీక్ష పెడతానని రజనీ సార్ చెప్పారు. అందుకే చాలా శ్రద్ధగా చదువుతున్నాను అంటూ అభిమానులతో ఆ అనుభవాన్ని పంచుకున్నారు.
రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే మంచి స్పందనను అందుకున్నాయి. రజనీకాంత్ కొత్త లుక్, కథాంశంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. రజనీకాంత్ లాంటి దిగ్గజ నటుడు తనపై చూపిన ఆప్యాయత, ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని రాశీ ఖన్నా చెప్పడంతో, అభిమానులు తలైవా గొప్ప మనసును మరోసారి ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రాశీ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.