BRICS Summit : ఇండియా ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బ్రిక్స్ సదస్సును పాకిస్తాన్, ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఐఎస్ఐ భగ్నం చేయాలని ప్రయత్నించాయి. ఈ విషయం తాజాగా బయటపడింది. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలో అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 11-13 వరకు ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వంటి అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సదస్సు ఇండియా నిర్వహించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది.
అయితే, ఇలాంటి సదస్సుకు ఆటంకం కలిగించాలని పాక్, ఐఎస్ఐ ప్రయత్నించాయి. జమ్మూ కాశ్మీర్ కథ్వా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ నుంచి ఉగ్రవాదులను సరిహద్దుగుండా ఇండియా పంపించాలని ప్రయత్నించింది. సదస్సు సందర్భంగా దేశంలో పెద్ద ఉగ్రదాడి జరపాలని ప్రయత్నించింది. ఇందుకోసం హీరానగర్లోని బోబియా ప్రాంతంలో సరిహద్దు నుంచి ఇండియాలోకి చొరబడేందుకు కొన్ని స్థావరాల్ని కూడా పాక్ ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వ భద్రతా దళాలు ముందుగానే పసిగట్టాయి. ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. పాకిస్తాన్లోని అమ్రు చాక్, సుక్మాల్ ప్రాంతాలు.. ఇండియాలోని హీరానగర్ ప్రాంతాన్ని సరిహద్దుగా పంచుకుంటాయి.
ఇది మన సరిహద్దుకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడినుంచి ఇండియాలోకి సులభంగా చొరబడవచ్చని పాక్, ఐఎస్ఐ భావించాయి. ఈ ప్రాంతంలో చొరబాటుదారులకు రక్షణ కల్పించే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలోనే జమ్మూ-పఠాన్కోట్ హైవే ఉంది. ఇక్కడినుంచి ఇండియాలోని ప్రభుత్వ భవనాలు, మిలిటరీ క్యాంపులు, సాధారణ ప్రజల్ని లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే, భద్రతా బలగాల అప్రమత్తతతో పెను ఉగ్రదాడి తప్పింది.