Box Office | సినీ అభిమానులకు ప్రతి నెల కొత్త సినిమాలతో వినోదం అందుతుంటుంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలయ్యే పెద్ద చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. జూలై నెలలో విడుదలైన విజయ్ దళపతి ‘జననాయగన్’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాలు మంచి స్పందనతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ ఆగస్టు నెలలో కూడా పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఈ నెలలో విడుదల కానున్న ప్రధాన చిత్రాలు చూస్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న థియేటర్లలోకి రానుంది. టైటిల్, పోస్టర్లు, ప్రచార చిత్రాలతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, దక్ష నగార్కర్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. ఎస్. థమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక తమిళ స్టార్ సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘కరుప్పు’ విజయానంతరం సూర్య నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. మమతా బైజు కథానాయికగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోవైపు ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఆగస్టు 26న గ్రాండ్‌గా విడుదల కానుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఆగస్టు నెలలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది. హారర్ కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, పాన్ ఇండియా ఎంటర్టైనర్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ నెలలో విడుదల కానున్న చిత్రాల్లో ఏవి బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలుస్తాయి? ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.