Ration Cards | మెదక్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్-2026 నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ పంపిణీ కొనసాగుతున్నందున అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అయితే మూడు నెలల బియ్యం పొందాలంటే రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని కోరారు. చిన్నారుల ఈ-కేవైసీని ఐరిస్ (Iris) పరికరం ద్వారా నమోదు చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
ఈ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ఎలాంటి ఆటంకం లేకుండా అందుతుందని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులను గుర్తించి వ్యక్తిగతంగా సమాచారం అందించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ, ఈ-కేవైసీపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రేషన్ బియ్యం పంపిణీతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియను సమాంతరంగా కొనసాగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద ఆదేశించారు.