Sleep | మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్దకం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. అయితే కొన్ని సులభమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ప్యాంక్రియాస్ అధికంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ పెరగడంతో మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరం మందగించి నిద్రమత్తు ఎక్కువగా అనిపిస్తుంది.
అయితే ఈ కారణంగా మధ్యాహ్న భోజనం మానేయడం సరైన పరిష్కారం కాదు. బదులుగా భోజనం చేసిన తర్వాత కొన్ని చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే శరీరం చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చొని పని ప్రారంభించకుండా ఐదు నుంచి పది నిమిషాలు నడవడం మంచిది. కార్యాలయం పరిసరాల్లో చిన్న నడక చేయడం లేదా మెట్లు ఎక్కడం వంటి తేలికపాటి శారీరక వ్యాయామం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి శక్తిని అందిస్తుంది. దీంతో నిద్రమత్తు తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. పుదీనా రుచి కలిగిన షుగర్ ఫ్రీ చ్యూయింగ్ గమ్‌ను కొద్దిసేపు నమలడం కూడా అప్రమత్తతను పెంచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీనిని అధికంగా ఉపయోగించడం మంచిది కాదు.
రోజంతా తగినంత నీరు తాగడం కూడా ఎంతో ముఖ్యం. శరీరంలో నీటి కొరత ఏర్పడితే అలసట, మానసిక నిరుత్సాహం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మధ్యాహ్న భోజనం తర్వాత కూడా తగినంత నీరు లేదా ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజనాన్ని మితంగా తీసుకోవడం, ఎక్కువ నూనె, కొవ్వు, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించడం, పీచుపదార్థాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా భోజనం తర్వాత వచ్చే నిద్రమత్తును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ తగినంత నిద్రపోయినా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ప్రతిరోజూ అధికంగా నిద్రమత్తు వస్తుంటే, దాని వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.