సినిమా పేరు: విష్ణు విన్యాసం
తారాగణం: శ్రీవిష్ణు, నయన్సారిక, గోపరాజ రమణ, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీశర్మ..
సంగీతం: రథన్
డీవోపీ: సాయిశ్రీరామ్
దర్శకత్వం: యదునాథ్ మారుతీరావు
నిర్మాత: సుమంత్ నాయుడు జి.
శ్రీవిష్ణుని మ్యాన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుంది. దానికి తగ్గట్టే ‘విష్ణు విన్యాసం’ సినిమాను మొదట్నుంచీ పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రచారం చేశారు. శ్రీవిష్ణు కామెడీ మూవీ అనగానే ఆడియన్స్‌లో అంచనాలు కామన్. దాంతో నిర్మాణంలో ఉండగానే సినిమాపై హైప్ మొదలైంది. దానికి తగ్గట్టు ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్ పెట్టి తొలి అడుగులోనే ఆడియన్స్‌లో మార్కులు కొట్టేశాడు దర్శకుడు యదునాథ్ మారుతీరావు. మరి ఇన్ని అంచనాలతో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ అందరికీ నచ్చిందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో విజయం నమోదైందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ముందు కథలోకి వెళ్లాలి..
కథ
విష్ణు(శ్రీవిష్ణు) ఓ కాలేజ్‌లో ట్రైనీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. తను పర్మినెంట్ అవ్వాలంటే అల్రెడీ అక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్‌లో ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేయాలి. తనెవరి దగ్గరైతే పనిచేశాడో.. వాళ్లకు విష్ణు ప్రవర్తన, కేపబులిటీ నచ్చితే.. వాళ్లు కాలేజ్ హై కమాండ్‌కి ప్రిఫర్ చేస్తే అప్పుడు అతను పర్మినెంట్ లెక్చరర్ అవుతాడు. దీనికోసం సర్వవిధాలా ప్రయత్నిస్తుంటాడు విష్ణు. అయితే.. విష్ణుని ఎలాగైనా కాలేజ్ నుంచి పంపించేయాలని కొందరు లెక్చరర్స్ ప్రయత్నిస్తుంటారు. విష్ణుని ఎవరి దగ్గరా చేరనీయకంపడా పావులు కదుపుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే కాలేజ్‌లో పనిచేస్తున్న లేడీ లెక్చరర్ మనీషా(నయన్సారిక) విష్ణుని తన అసిస్టెంట్‌గా చేర్చుకుంటుంది. మనీషా అదొక టైప్. అన్ని వ్యసనాలూ ఉన్నట్టు కనిపిస్తున్న మనీషా దగ్గర తప్పక పనిచేస్తుంటాడు విష్ణు. కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా మనీషా, విష్ణు ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణుకు మనీషాకు సంబంధించిన ఓ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏవిటా నిజం? అసలు అన్ని వ్యసనాలూ ఉన్న అమ్మాయిలా మనీషా ఎందుకు కనిపించింది? అసలు శ్రీవిష్ణుకు మనీషా ఎందుకు దగ్గరైంది? మనీషాకూ, విష్ణుకీ పెళ్లి జరిగిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఈ కథలోని కాంఫ్లిట్టే వైరైటీగా ఉంది. ప్రారంభం నుంచి ప్రశ్నలతోనే కథను మొదలుపెట్టాడు దర్శకుడు యదునాథ్ మారుతీరావు. జాతకాలను అతిగా విశ్వసించే హీరో.. జాతకంలో ఉండకూడని లోపం ఉన్న హీరోయిన్. ఇలాంటి ఇద్దరూ ప్రేమలో పడితే?.. గెలుపు నమ్మకానిదా? ప్రేమదా? అనేది ఈ కథలో కొత్తపాయింట్. దాన్ని దర్శకుడు మారుతీరావు వినోదాత్మకంగా చెప్పాడు. ఒకానొక దశలో హీరోయిన్ క్యారెక్టర్‌పైనే ఆడియన్స్‌కి అనుమానం కలిగేలా చేశాడు. ఈ క్రమంలో బాగా నవ్వించాడు కూడా. ఇంట్రవెల్ బ్యాంగ్‌లో అసలు విషయం రివీల్ చేసి, అందరికీ షాక్ ఇచ్చాడు. సెకాండాఫ్ అంతా అసలు కథను నడిపించాడు. చివరకు వినోదాత్మకంగా ముగింపు పలికాడు. ఓ విధంగా ఇది హీరోయిన్ కథ. ఆమె జీవితంలోకి హీరో రావడం, ఆమె జీవితానికి ఓ అర్థాన్నివ్వడంతో కథ ముగిసింది. మొత్తంగా ప్రథమార్ధం కామెడీగా, ద్వితీయార్ధం కాస్తంత కామెడీ, కాస్తంత ఎమోషన్స్‌తో సరదాగా సినిమా గడిచిపోయింది..
నటీనటులు
శ్రీవిష్ణు కామెడీ బాగా చేస్తాడు. పైగా ఇందులో ఆయన పోషించిన విష్ణు పాత్రలోని కామెడీ ఉంది. దాంతో ఇరగదీసేశాడు. ఎప్పటిలాగే మంచి జోష్‌తో తెరపై శ్రీవిష్ణు సందడి చేశారు. మ్యాన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే బిరుదుని సార్థకం చేశాడు. ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన నయన్సారిక కూడా చాలా బాగా నటించింది. నిజానికి ఆ అమ్మాయిది చాలా బరువైన పాత్ర. అతి తక్కువ పిరియడ్‌లో ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా తన అదృష్టమే. ఇక కమెడియన్ సత్య ఎప్పటిలాగే అందర్నీ నవ్వించాడు. ఇక మిగతా నటీనటులంతా తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా
దర్శకుడు రాసుకున్న కథ బావుంది. పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని తెరపై చక్కగా ప్రజెంట్ చేశాడు. కానీ ద్వితీయార్ధం కాస్తంత స్లో అయిన ఫీలింగ్ కలిగింది. రథన్ సంగీతం బావుంది.. ఆర్ఆర్ కూడా అభినందనీయంగానే ఉంది. సాయిశ్రీరామ్ డీవోపీ తెరకు నిండుదనాన్ని తెచ్చింది. మొత్తంగా సాంకేతికంగా సినిమా మెచ్చదగ్గ విధంగానే ఉంది. సినిమా నిడివి కూడా చాలా తక్కువు. కేవలం రెండు గంటలు మాత్రమే సినిమా ఉంది. కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకుంటే ‘విష్ణు విన్యాసం’కి వెళ్లొచ్చు. యాక్షన్, ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.
బలాలు
శ్రీవిష్ణు కామెడీ. నాయన్సారిక నటన, కథలో కొత్తదనం,
బలహీనతలు
సెకండాఫ్ కాస్తంత స్లో అవ్వడం
రేటింగ్ : 2.75/5