Air India Flight : ఈ మధ్య కాలంలో ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియాకు చెందిన AI-171 విమానం కుప్పకూలి 279 మంది మరణించినప్పటి నుంచి తరచూ లోపాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నుంచి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) కి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది.
శనివారం రాత్రి 10.55 గంటలకు AI-639 విమానం ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఆ తర్వాత కాసేపటికే క్యాబిన్లో కాలిన వాసన రావడంతో పైలట్ ఆ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ముంబైలోనే దించాడు. అనంతరం ఎయిరిండియా అధికారులు మరో విమానంలో ప్రయాణికులను చెన్నైకి పంపించారు.
ఈ విషయాన్ని ఎయిరిండియా అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమమే తమ సంస్థ తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.