Oscars 2026 | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక ఎంపికయినట్లు తెలుస్తుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 15న జరగనున్న ఈ మహా వేడుకలో హాలీవుడ్ అగ్ర నటులైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో కలిసి ప్రియాంక వేదికను పంచుకోనుండటం విశేషం. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించగా.. ప్రియాంక సైతం తన సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. గతంలో 2016లో కూడా ఆమె ఆస్కార్ ప్రజెంటర్‌గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించగా, సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్ళీ అదే గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం.
ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు మరో ప్రత్యేకత ఉండబోతుంది. ప్రముఖ టీవీ హోస్ట్ కోనన్ ఓ’బ్రియన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రజెంటర్ల జాబితాలో ప్రియాంకతో పాటు అన్నే హాత్వే, గ్వినేత్ పాల్ట్రో, పాల్ మెస్కల్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈసారి ‘Sinners’ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తమ నటుడి కేటగిరీలో లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి హేమాహేమీల మధ్య గట్టి పోటీ నెలకొంది.