ముంబై, మార్చి 27: విదేశీ నిల్వలు కరిగిపోతున్నాయి. గత నెల రోజులుగా తగ్గుతూ వచ్చిన రిజర్వులు 700 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 11.413 బిలియన్ డాలర్లు తరిగిపోయి 698.346 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. గోల్డ్ రిజర్వులు తగ్గుముఖం పట్టడం ప్రధాన కారణమని పేర్కొంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 7.053 బిలియన్ డాలర్లు తగ్గి 709.759 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వరుసగా రెండు వారాల్లో 20 బిలియన్ డాలర్ల వరకు తగ్గినట్టు అయింది. ఫిబ్రవరి నెల చివరి వారంలో రికార్డు స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైన నాటినుంచి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. గత వారం లో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.127 బిలియన్ డాలర్లు ఎగబాకి 557.695 బి.డాలర్లకు చేరుకున్నాయి.