Pharma City | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ‘ఇంద్ర’ సినిమా గుర్తుందా? ఓ వ్యక్తిని నిలువునా దోచుకోవాలన్న ఉద్దేశంతో ఓ దొంగల ముఠా ‘నీది తెనాలే.. నాది తెనాలే.. మనది తెనాలే’ అంటూ ముగ్గులోకి దింపుతుంది. అచ్చం ఆ సినిమా సీన్‌ను తలపించేలా.. ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నేతలు.. ‘నీది యాచారం.. నాది యాచారం’ అంటూ ఒక్కతల్లి బిడ్డలం అన్నట్టుగానే ఆ రైతుల ముంగిట కలరింగ్ ఇచ్చారు. అది నమ్మిన అన్నదాతలు వారి వెంట నడిచారు. తీరా అధికారంలోకి వచ్చాక.. ముందుండి నడిపించిన ఆ నేతలే ముఖం చాటేశారు. తాము మోసపోయామని రైతులు గుర్తించేలోపే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇదీ.. రంగారెడ్డి జిల్లా యాచారం ‘ఫార్మా’ రైతుల గోస!
యాచారం రైతుల గోడు పూర్తిగా అర్థం కావాలంటే, 2017కు వెళ్లాలి. ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో ఉన్న 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. దాని ప్రకారం మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలను భూసేకరణకు ఎంపిక చేశారు. అయితే, ఫార్మాసిటీ ప్రకటన వెలువడిన రోజు సాయంత్రమే కాంగ్రెస్ అనుబంధ కిసాన్‌సెల్ రాష్ట్ర చైర్మన్ కోదండరెడ్డి స్పందించారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొంతమంది రైతులను కూడగట్టారు. ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. అలాగే, ఫార్మాసిటీని రద్దు చేయాలని వినతిపత్రం కూడా అందజేశారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఎం, బీజేపీ, తెలంగాణ జనసమితి పార్టీతోపాటు పలు సంస్థలు ఫార్మాసిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. పార్టీలు, ఎన్జీవోల మద్దతుతో రైతులు ఉద్యమబాట పట్టారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకొని నిరసనలు ప్రారంభించారు.
‘మన దగ్గర గొలుసు కట్టు చెరువులున్నయ్. భూములకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయ్. మనకు హైదరాబాద్ కూడా దగ్గర. కూరగాయలు, పాలు అమ్ముకుని బతుకొచ్చు. పొద్దునే చేనుకుపోయి పొద్దెక్కేలోపు ఇంటికి రావొచ్చు. భూమి వదులుకోవద్దు. వదులుకుంటే ఆగమైతం’ అంటూ ఉధృతమైన ప్రసంగాలతో కోదండరెడ్డి రైతులను రెచ్చగొట్టారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దంటూ ఊరూరూ తిరిగారు. ఫార్మా వ్యతిరేక పాదయాత్రను ముందుండి నడిపించారు. మేడిపల్లి నుంచి తుర్కయాంజాల్ ఆర్డీవో కార్యాలయం వరకు ఆయనను నమ్మిన రైతులు పాదయాత్ర చేశారు. కోదండరెడ్డితోపాటు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు మద్దతు తెలుపడమే కాకుండా ఫార్మాసిటీని అడ్డుకుంటామని హామీనిచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందరి కంటే ఒకడుగు ముందుకేసి.. ‘రైతుల దగ్గరకు రావాలంటే, నన్ను దాటుకుంటూ పోవాలె. నన్ను తాకిన తర్వాతనే మీ దాకా!’ అంటూ రైతుల కోసం దేనికైనా సిద్ధమే అన్నట్టు ఊదరగొట్టారు. ఈ నేతల మాటలు నమ్మిన రైతులు తమ భూములు ఎక్కడికీ పోవనుకొని పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు.
ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కుర్మిద్దలో రైతులు రిలే నిరాహార దీక్ష చేశారు. మూడు గ్రామాల్లో రైతుల ఆందోళన ఊపందుకొన్నదని తెలిసిన వెంటనే కాంగ్రెస్ సీనియర్లు అక్కడ వాలిపోవడం మొదలుపెట్టారు. ప్రస్తుత మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు వచ్చి రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. వారితోపాటు తెలంగాణ జనసమితి నేత కోదండరాం ఏకం గా నాలుగుసార్లు ఆయా గ్రామాల్లో పర్యటించారు. యాచారం ఫార్మా వ్యతిరేక పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ ప్రసంగాలు చేశారు. పన్నెండు రోజులపాటు ఆ రిలే నిరాహార దీక్ష కొనసాగింది. అయితే, రైతుల నిరసనలపై స్పం దించిన ప్రభుత్వం.. భూములిచ్చిన అన్నదాతలకు మరింత మేలు జరుగాలన్న ఉద్దేశంతో పరిహారాన్ని భారీగా పెంచింది. ఫలితంగా పలువురు రైతులు స్వచ్ఛందంగానే భూములను విక్రయించారు. దీంతో రైతుల పేరిట ఉన్న ఆ వ్యవసాయ భూములను ఆన్లైన్లో తొలగించారు. ఇదే సమయంలో నిరసనలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ‘భూములు మీవే.. పైసలు కూడా మీవే’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపస్ ఇస్తామని, ప్రభుత్వం పరిహారంగా ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి తీసుకోబోమని నమ్మబలికారు. వాళ్ల మాటల్ని రైతులంతా నమ్మారు. అలా సీఎం రేవంత్ అప్పట్లో నిర్వహించిన పాదయాత్రలో రైతులూ పాల్గొన్నారు. మరోవైపు, భూసేకరణ ఆపాలని కోరుతూ రైతులు, కూలీలు కొందరు కోర్టుకుపోయారు. కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు.
ఇదిలాగే కొనసాగుతున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి, రైతుల భూములను తిరిగి రికార్డుల్లోకి ఎక్కిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. తమ మాటను రైతులు నమ్మబోరేమోనన్న అనుమానంతో ఫార్మాసిటీ రద్దుని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపర్చారు. అసైన్డ్ భూములకూ పట్టాలిస్తామన్నారు. ఇక, ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇంత పచ్చని పొలాలు వదులుకొని రైతులు యాడికి పోతరు? రెండు మూడు నెలలు ఓపిక పట్టుండ్రి. మన గవర్నమెంటే వస్తది. మీ భూములు మీకే వస్తయ్’ అంటూ నమ్మబలికారు. నిజమేనేమో అని భావించిన రైతులు కాంగ్రెస్‌కు ఓటేశారు. యాచారం ఫార్మాసిటీ ఉద్యమం వల్లే కాంగ్రెస్‌కి ఇబ్రహీంపట్నంలో నలభై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఫార్మాసిటీ రద్దు చేస్తానన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కథ అడ్డం తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన నిలిచినట్టు నటించిన కాంగ్రెస్ పెద్దలు.. అధికార పీఠం ఎక్కగానే ప్లేటు ఫిరాయించారు. ‘ఇస్తానన్న భూములు ఇయ్యండి. మా పేర్లు ఆన్‌లైన్‌లోకి ఎక్కించండి’ అని రైతులు ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకొంటే.. కుంటిసాకులు చెప్తూ కొంతకాలం వెళ్లదీశారు. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఎన్నికల కోడ్ సాగుతో ఈ వ్యవహారాన్ని మరికొంతకాలం నాన్చారు. అయితే, ప్రభుత్వ వైఖరిపై అనుమానం వచ్చిన ఓ రైతు.. కోర్టుకెళ్లాడు. ‘మా భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతించట్లేదు’ అంటూ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఫార్మాసిటీని తాము రద్దు చేయలేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. కానీ ఆ భూమిని ఫ్యూచర్‌సిటీ కోసం వాడుకోవడానికి సిద్ధమైంది. ఫార్మాసిటీ కట్టదు.. రైతులకు భూములను తిరిగి ఇవ్వదు. వాటిని ఫ్యూచర్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాకు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకొంటున్నదని రైతులకు కొద్దికాలానికే అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ప్రకటించిన ‘ఫార్మాసిటీ రద్దు’ మాటలన్నీ నీటి మూటలేనని.. ఇది ఫక్తు రియల్ఎస్టేట్ దృక్పథం ఉన్న ప్రభుత్వమని తక్కువ సమయంలోనే రైతులకు తెలిసివచ్చింది.
గతంలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా గ్రామగ్రామాన సభలు పెట్టి, పాదయాత్రలు కూడా చేసిన అప్పటి రేవంత్.. ఇప్పుడు అదే రైతులపై కక్షగట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆయా గ్రామాల్లో నలుగురు రైతులు కలిసి మాట్లాడుకోవడం నిషిద్ధమైంది. పచ్చని పల్లెలపై ఇంటెలిజెన్స్ నిఘా పెరిగింది. పోలీసుల గస్తీ ముమ్మరమైంది. ఫార్మాసిటీ వద్దని, ఫ్యూచర్ సిటీకి విలువైన తమ భూములు ఇవ్వబోమని ఎవరైనా గొంతెత్తితో పోలీసులు నిమిషాల్లో వచ్చి నోరు నొక్కుతున్నారు. ఎంతోమంది రైతుల్ని బైండోవర్ చేశారు. గ్రామాల్లో రైతులు సమావేశం జరుపుకోవడానికి కోర్టు అనుమతి తెచ్చుకునేంత నిర్బంధం ఈ పల్లెల్లో అమలవుతున్నది. కోర్టులో స్టే తెచ్చుకున్నా.. ఫ్యూచర్‌సిటీ కోసం అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ‘ప్రజాపాలన’ అంటే ఇదేనా? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని రైతులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.
తమకు ద్రోహం తలపెట్టిన కాంగ్రెస్ నేతలపై ఇప్పుడు అదే రైతులు ఉద్యమిస్తున్నారు. సీపీఎం స్థానిక నాయకత్వం తొలుత రైతుల ఉద్యమంలో పాల్గొన్నా.. ఇప్పుడు ఆ పార్టీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడపడానికి సిద్ధంగాలేదు. కోదండరాం కూడా ముఖం చాటేశారు. దీంతో రాజకీయ నాయకులపై ఆధారపడకుండా రైతులే తమ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ధర్నాలు, నిరసనలతో అధికార పార్టీ నేతలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. అక్కడి రైతులకు భయపడి కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు రావడమే మానేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని 11రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు. పదవుల కోసం, అధికారం కోసం కాంగ్రెస్ చేసిన ద్రోహాలకు యాచారం రైతుల ఉదంతం ఓ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఊదరగొట్టగానే రైతులు పండుగ చేసుకొన్నారు. రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేట ముంచిందని తెలుసుకొన్న రైతులకు మరికొన్ని కొత్త కష్టాలు చుట్టుముట్టాయి. ఆన్లైన్లో రైతుల పేరిట ఆ భూములు లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన రైతుబంధు నిలిచిపోయింది. వ్యవసాయ రుణాలు ఆగిపోయాయి. యూరియా కష్టాలూ చుట్టుముట్టాయి. ఒకవైపు రైతులు ఇన్ని బాధలు పడుతుంటే, ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నాడు తీసుకొచ్చి అన్నదాతలను రెచ్చగొట్టిన కోదండరెడ్డి.. తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ అయ్యారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమానికి మద్దతు తెలిపినట్టు నటించిన కాంగ్రెస్ నేతలు మంత్రులయ్యారు. తెలంగాణ క్యాబినెట్లో సగం మంది వాళ్లే. కానీ, యాచారం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీని మాత్రం నెరవేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా, మిగిలిన రైతులు కూడా ఫ్యూచర్‌సిటీకి భూములు ఇవ్వాలని అధికారులు వేధించడం మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టిన కోదండరెడ్డి.. రైతు కమిషన్ చైర్మన్ కాగానే మాట మార్చారు. ‘అభివృద్ధికి సహకరించాలి. భూములు ఇవ్వకపోతే అభివృద్ధి ఎట్ల జరుగుతుంది’ అంటూ కొత్తరాగం అందుకున్నారు. మొత్తంగా అందరూ కలిసి.. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టారు.
‘భూములు వదులుకోవద్దు’ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాన్ని నడిపిన కోదండరెడ్డి.. రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ పదవి దక్కగానే మాటమార్చారు. ‘రేవంత్‌రెడ్డి మంచిగ చేస్తున్నడు. ప్రభుత్వానికి మీరు సహకరించాలె. కొంతమంది త్యాగం చేస్తేనే ఈ ఏరియా డెవలప్ అయితది’ అంటూ రైతులను కోదండరెడ్డి ఏమార్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా.. భూములు వదులుకోవద్దని పోరాటం చేసినచోటే ఉన్న తన రెండు వేల గజాల స్థలాన్ని, అందులోని భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చారు. తనలాగే రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలంటూ ఉచిత సలహాలిచ్చారు. కోదండరెడ్డి వైఖరిపై రైతన్నలు మండిపడుతున్నారు. ‘వంద ఎకరాల భూమి ఉన్న కోదండ రెడ్డి.. కేవలం రెండు వేల గజాల స్థలం ఇవ్వడం గొప్ప కాదు’ అని రైతులు విరుచుకుపడుతున్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ అయినందుకు పేద రైతుల చేతుల్లో ఉన్న భూమిని కాపాడాలని, తమ నోటికాడ బువ్వను గుంజుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘భూమిలిచ్చి త్యాగాలు చేయమంటున్న నేతలు.. ఎవరి కోసం మేం త్యాగాలు చేయాలో కూడా చెప్పాలె’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని ద్రోహాలు చేసినా తమ భూములను కాపాడుకోవడానికి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు. కాగా, ప్రతిపక్షంలో ఉండి ఎన్నో మాట్లాడి.. అధికారంలోకి రాగానే మాటమార్చడం నేతలకు మామూలేనని, అయితే, స్థానికుడైన వ్యక్తి, పైగా రైతు కమిషన్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కూడా రైతులకు ద్రోహం చేయడమేమిటని కోదండరెడ్డిపై స్థానికులు మండిపడుతున్నారు. ‘ఓడ మల్ల న్న.. బోడి మల్లన్న’ తరహాలో కోదండరెడ్డి వైఖరి ఉన్నదంటూ విరుచుకుపడుతున్నారు.

రెండు రోజుల క్రితం (25 మార్చి 2026) టీజేఎస్ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ‘ఫార్మా రైతులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలి’ అని అడిగినట్టు పత్రికల్లో వచ్చింది. భూసేకరణ రద్దు చేసి, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతుల పేర్లని ఆన్‌లైన్‌లోకి ఎక్కించి, అన్ని హక్కులు కల్పించాలని రైతులు పదే పదే అడుగుతున్నరు. ఈ విషయం గురించి ప్రొఫెసర్ కోదండరాం గారిని గత రెండేండ్లలో అనేకసార్లు కలిసి అడిగినం. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, మీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల ముందు ‘రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం’ అని చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం గారు, 2023 లో మా ప్రాంతంలో పాదయాత్ర చేశారు. ఆ సందర్భంలో ‘ఇక్కడ ఇన్ని చెరువులున్నాయ్. ఇంతమంచి పంట భూములున్నయ్. వీటిని ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వొద్దు. మీ ఉద్యమానికి నేను అండగా ఉంటా’ అని చెప్పారు. ఆయనే ఇప్పుడు ‘నష్టపరిహారం ఇయ్యండి’ అని కలెక్టర్‌ని ఎందుకు అడుగుతున్నరు?
పరిహారమే కావాలని మేం అడిగామా? మా భూములు మాకు ఇవ్వాలని అడుగుతున్నం. ఈ విషయం కోదండరాంకు తెలుసు. ప్రభుత్వం మాట తప్పిందనీ తెలుసు. రైతుల కోసం, మా న్యాయమైన హక్కుల కోసం, రైతుల పక్షాన నిలబడి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, రైతుల తరఫున పోరాటం చేస్తారని ఆయనపై మేం ఆశలు పెట్టున్నం. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడొచ్చి ప్రభుత్వం చెప్తున్న దానికే వంత పాడుతున్నరు. ఇది ఒక ఉద్యమనేత నుంచి ఆశించిన చర్యలు కావు!
ఇట్లు
ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ యాచారం, రంగారెడ్డి జిల్లా

22
కోదండ రెడ్డి ఇవే మాటలను ఆ రోజే చెప్తే ఎటో ఒకకెళ్లి పోయేటోళ్లం కదా. కేసీఆర్ సారు ఎకరానికి 30 లక్షలు ఇచ్చె. అప్పుడు డబ్బులు తీసుకొని యాడన్నా జాగ కొనుక్కుంటే బాగానే ఉంటుండె. అటుకాకుండా ఇటుకాకుండా కాంగ్రెస్సోళ్లు మమ్మల్ని ముంచిండ్రు. పదవి వచ్చినంక వంద ఎకరాలున్న కోదండరెడ్డి గవర్నమెంట్‌కు రెండు వేల గజాల జాగ ఇచ్చిండు. నాకు కూడా ఇరవై ఎకరాలున్నది. అందులోంచి ప్రభుత్వానికి ఎకరం రాసిస్త. అయితే, మా రైతుల భూములు గుంజుకోమని హామీనియ్యాలె. ఇస్తదా?
– కల్లు కొండల్‌రెడ్డి, మేడిపల్లి (యాచారం మండలం) కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు
ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ని రద్దు చేశామని బహిరంగంగా చెప్పి, రికార్డుల్లో రద్దు చేయలేదు. భూమిని ఏ ప్రాజెక్ట్ కోసం సేకరించారో ఆ ప్రాజెక్ట్ కోసమే ఉపయోగించాలి. లేదంటే రైతు భూమి ఆ రైతుకే ఇవ్వాలి అనే ఒప్పందం మీదనే భూములిచ్చినం. ఫార్మాసిటీ ప్రాజెక్ట్ రద్దు కానప్పుడు కుర్మిద్ద గ్రామ రైతుల భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు నోటిఫికేషన్ ఎట్లా ఇస్తరు? కొత్త నోటిఫికేషన్ ఇస్తే.. పాత నోటిఫికేషన్ రద్దు అయినట్టే కదా! ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం భూసేకరణ చట్టబద్ధంగా జరగట్లేదు. ఆ భూములు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటికీ సర్వేలు చేస్తున్నరు. రైతుల్ని బెదిరిస్తున్నరు. యాచారం ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమం వల్లే గెలిచిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తమను గెలిపించిన అదే రైతులనే దగా చేశారు.
– సరస్వతి కవుల, సామాజిక ఉద్యమకారిణి
కాంగ్రెసోళ్లు, కోదండరెడ్డి అప్పట్లో రోజూ వచ్చేది. కోదండరెడ్డికి ఎప్పుడైతే పదవి వచ్చిందో అప్పుడు మమ్మల్ని వదిలేసిండు. కోదండరాం మద్దతుగా మాట్లాడుతున్నడు కానీ, మా కోసం ఉద్యమించట్లేదు. హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మూడు వేల ఎకరాలు విడిపించాలని శ్రీధర్‌బాబుకి నాలుగుసార్లు వినతిపత్రం సమర్పించినం. రైతు బంధు ఇయ్యమని మా ఎమ్మెల్యేని అడిగినం. అయినా, లాభంలేదు.
– దార సత్యం, తాడిపర్తి, యాచారం మండలం
ఫార్మా నోటిఫికేషన్ వచ్చిన రోజు కోదండరెడ్డి రైతులతోనే ఉన్నడు. పోరాడాలె అన్నడు. పదవి రాంగనే మారిపోయిండు. మా ఉద్యమాన్ని కొందరు దొంగలు నీరుగార్చిన్రు. ఎమ్మెల్యే గెలువంగనె మాట మార్చిండు. అయినా మేం పోరాడుతం. నాకున్న పన్నెండెకరాలు, మా చిన్నాయన కొడుకు, మా అన్న భూములు అన్నీ రికార్డుల్లో పోయినయ్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు వచ్చేది. కాంగ్రెస్ వచ్చినంక అయిదు పైసలు కూడా రాలే.
– దేవుజీ, కుర్మిద్ద, యాచారం మండలం