కాజీపేట, మార్చి 27 : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు చెందిన బెజవాడలోని గాలా (గుణదల) క్రూ డిపోపై రైల్వే జోన్ల పునర్విభజన ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. సమయం సమీపిస్తుండడంతో రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ విభాగంలో సందిగ్ధం పెరుగుతున్నది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో గతంలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరుతో ఆరు రైల్వే డివిజన్లు కొనసాగేవి. ఏపీ పునర్విభజనలో భాగంగా కేంద్రం ఆదేశానుసారం గతంలో రైల్వే పరిపాలనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ (దక్షిణ మధ్య రైల్వే జోన్)ను.. సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్), దక్షిణ కోస్ట్ రైల్వే (ఎస్సీవోఆర్) గా విభజించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ బైపర్కేట్లో భాగంగా బెజవాడ (గుణదల) గాలా క్రూ లాబీ డిపో వివాదంగా మారింది. బెజవాడలో 2007లో ఏర్పడిన గాల క్రూ డిపో సికింద్రాబాద్ డివిజన్‌కు తిరిగి రావాలని, విజయవాడ రైల్వే డివిజన్‌కు కావాలని.. రెండు రైల్వే డివిజన్లలోని రన్నింగ్ స్టాఫ్‌లో రోజురోజుకూ వివాదం ముదురుతున్నది.
బెజవాడలోని (గుణదల) గాల క్రూ లాబీ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉండి, ప్రస్తుతం దక్షిణ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లినప్పటికీ, అక్కడ పని చేస్తున్న లోకో పైలెట్లు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. విజయవాడలో స్థానిక ఉద్యోగులు మాత్రం తమను అక్కడే ఉంచి దక్షిణ మధ్య రైల్వే జోన్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గాలా జేఏసీ నాయకులు.. రైల్వే అధికారులకు వరంగల్‌లో మౌలిక సదుపాయాల కొరత వల్ల అక్కడ సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయొద్దని ఓ లేఖలో విన్నవించారని రైల్వే యూనియన్లు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం వరంగల్‌పై ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంత మంది నాయకుల ప్రోద్బలంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేయకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు, సీమాంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఉద్యోగులు మండిపడుతున్నారు. 2010 నుంచి గాలా క్రూ డిపోను ఎత్తేసి వరంగల్‌ను సెంట్రలైజ్డ్ క్రూ లాబీ చేయాలనే డిమాండ్ ముందుకు రావడంతో ఉన్నత స్థాయిలో ఉన్న సీమాంధ్ర రైల్వే ఆధికారులు ఈ విషయం తెరపైకి రాకుండా అంతర్గతంగా అడ్డుకట్టలు వేశారు. వరంగల్‌లో సెంట్రలైజ్డ్ లాబీ ఏర్పాటు చేస్తే, కార్మికుల కుటుంబాలకు విద్య, వైద్య ఇతర మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. వరంగల్‌ను సెంట్రలైజ్డ్ లాబీ చేయాలని రైల్వే ట్రేడ్ యూనియన్లు ఇతర సంఘాల మద్దతును కూడగట్టేందుకు ఇటీవల ఏర్పడిన కాజీపేట రన్నింగ్ స్టాఫ్ రైల్వే జేఏసీ తీవ్రంగా శ్రమిస్తున్నది.
ఉత్తర, దక్షిణ ధృవాలకు ముఖద్వారంగా సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోనే రెండో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా కాజీపేట జంక్షన్ ఉంది. గతంలో 1500 మంది లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్లతో విధులు నిర్వర్తించిన క్రూ డిపోలో ప్రస్తుతం 15 క్రూ లింక్‌లను మాత్రమే నడిపింది. రైల్వే డివిజన్ హోదా ఏర్పాటుకు అన్ని అర్హతలున్న కాజీపేట క్రూ లాబీ ప్రస్తుతం వెలవెలబోతున్నది. కాజీపేట రైల్వే జంక్షన్ గతం నుంచి సీమాంధ్ర పాలకులు, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్ని విధాలా నిర్వీర్యమైంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే విభజన కానున్న నేపథ్యంలో విజయవాడలోని గాల క్రూ డిపోను మూసేసి వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేయాలని రైల్వే కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైల్వే జోన్ల విభజన నేపథ్యంలో గాలా క్రూ డిపోకు చెందిన అన్ని క్రూ లింక్‌లను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేసి వాటినన్నింటిని కేటాయించాలని లోకో రన్నింగ్ స్టాఫ్ జేఏసీ నాయకులు కోరుతున్నారు. 15 ఏండ్ల నుంచి గాలా క్రూ డిపోను ఎత్తివేసి వరంగల్ సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేయాలని లోకో రన్నింగ్ స్టాఫ్, రైల్వే కార్మిక వర్గాలు ఉద్యమిస్తున్నాయి. 2007లో ప్రారంభమైన గాలా క్రూ డిపో రన్నింగ్ స్టాఫ్ క్రూ సిబ్బంది ప్రస్తుతం విజయవాడ-బల్లార్ష- విజయవాడ వరకు 900 కిలో మీటర్లు రైళ్లను ఆపరేట్ చేస్తుండటంతో 30 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు.
గాలా డిపోను వరంగల్‌కు తరలిస్తే సిబ్బందిపై పని భారం తగ్గుతుండటంతో పాటు ప్రయాణికుల భద్రత పెరుగుతుందని రైల్వే లోకో పైలెట్లు, ట్రైన్ మేనజర్లు పేర్కొంటున్నారు. వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేస్తే లోకో రన్నింగ్ స్టాఫ్ విజయవాడ- వరంగల్, వరంగల్-బల్లార్ష, వరంగల్- సికింద్రాబాద్ వరకు విధులు చేపడుతారు. దీంతో విధులు, ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు.
తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్య ఇతర మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మేరకు యూనియన్ డివిజన్ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్ రైల్వే డివిజనల్ మేజనర్ (డీఆర్ఎం)కు లేఖ రాశారు.
– సాయికుమార్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, కాజీపేట్ లోకో రన్సింగ్ బ్రాంచి సెక్రటరీ
వరంగల్‌లో లోకో పైలెట్ల లాబీకీ శాశ్వత పరిష్కారం అవసరం. వరంగల్‌లో సెంట్రలైజ్డ్ లాబీని ఏర్పాటు చేయడమే జేఏసీ లక్ష్యం. రైల్వే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలి. కాజీపేట రైల్వే జంక్షన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీంతోపాటు ఉత్తర, దక్షిణ ధృవాలకు ముఖ్య కూడలిగా పని చేస్తున్న కాజీపేట క్రూ లాబీకి రైల్వే అధికారులు, ట్రేడ్ యూనియన్లు న్యాయం చేయాలి.
– ఎం రమేశ్, లోకో పైలెట్ జేఏసీ కన్వీనర్, కాజీపేట