Hamas leader : గాజాపై ఇజ్రాయెల్ (Israel) చేసిన తాజా వైమానిక దాడుల్లో (Air strikes) హమాస్ (Hamas) కీలక నేత హతమయ్యాడు. తాము గాజాపై దాడిచేసి హమాస్ సహ వ్యవస్థాపకుడు, సైనిక విభాగ కీలక నేత అయిన హకామ్ మహమ్మద్ ఇస్సా అల్-ఇస్సా (Hakam Muhammad Issa Al-Issa) ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ (Israel) సైన్యం ప్రకటించింది.
గాజాలోని సబ్రా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లు తెలిపింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడికి అతడే ప్రణాళిక రచించి, అమలు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. టెల్ అవీవ్‌పై హమాస్ చేసిన మరిన్ని దాడుల్లో కూడా ఇస్సా హస్తం ఉన్నట్లు తెలిపింది. దాడుల్లో దెబ్బతిన్న గాజాలోని హమాస్ సంస్థాగత వ్యవస్థలను పునరుద్ధరించడానికి అతడు పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
మహమ్మద్ ఇస్సా గతంలో గాజా స్ట్రిప్‌లో హమాస్ బలగాలను తయారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించాడు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్‌లోని అనేక మంది ఉన్నతస్థాయి అధికారులను హతమార్చింది. వీరిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్, ముఖ్య నేత సలేహ్ అరౌరీ, హెజ్బొల్లా నిఘా అధినేత అబ్బాస్ అల్-హసన్ వాహ్బీ, అక్టోబర్ 7 నాటి దాడుల కీలక సూత్రధారి అబ్దల్ హదీ సబా తదితరులు ఉన్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై రెబెల్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మందిని హమాస్ బంధించి గాజాకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలవగా ఇంకా 97 మంది హమాస్ చెరలో ఉన్నారు. వారిలో ఇప్పుడు 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.
ఇక హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,08,338 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.