Ind vs Pak : పాకిస్థాన్ (Pakistan) లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి (Suicide attack) వెనుక భారత్ హస్తం ఉందని పాక్ సైన్యం చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ (MEA) కొట్టిపారేసింది. ఆ దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దాడి వెనుక తమ హస్తం ఉందంటూ పాకిస్థాన్ సైన్యం చేస్తున్నవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
పాక్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని, ఈ దాడి నేపథ్యంలో భారత్‌పై నిందలు వేస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పాక్ సైన్యం ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేసింది.
కాగా పేలుడు పదార్థాలున్న వాహనంతో ఓ ఉగ్రవాది ఆర్మీ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లాడు. దాంతో వాహనంలో భారీపేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పౌరులు, ప్రభుత్వాధికారులు కలిపి మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలావుంటే.. పాకిస్థాన్‌లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన ఉసూద్-అల్-హర్బ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.