PM Modi : భారత్ ట్రకోమా (Trachoma) రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయాన్ని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) గుర్తుచేశారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన ట్రకోమా రహిత దేశంగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ విషయాన్ని ఆదివారం తన మన్ కీ బాత్లో గుర్తుచేశారు.
ఆదివారం ప్రధాని మోదీ 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 21న జరిగిన యోగాడే కార్యక్రమంలో దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పాల్గొన్నారని అన్నారు. దాదాపు పదేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేట మరింత విస్తరిస్తోందని చెప్పారు. చాలామంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని తెలిపారు.
50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. నాడు జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారన్నారు. కానీ భారత ప్రజలు శక్తిమంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. దానిని విధించినవారు ఓడిపోయారని గుర్తుచేశారు.
మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్ మారిందని అభినందించారు. వారు పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు.
దేశంలోని చిన్నారులకు వారు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్నెస్ కాపాడుకోవడానికి, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా మేఘాలయ ఎరీసిల్క్కు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకతని తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పారు. అందరూ తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు.