ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్/ ఇల్లెందు/ వైరా టౌన్, సెప్టెంబర్ 17 : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఆయన కృషి, దీక్ష, పట్టుదల వల్లనే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని గుర్తుచేశారు. ఆయన లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని స్పష్టం చేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం వేడుకలు నిర్వహించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి జిల్లా కార్యాలయంలో ఆ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఉద్యమ నేత దిండిగాల రాజేందర్, ఇల్లెందులోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, వైరాలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తదితరులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ గులాబీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన వేడుకల్లో తాతా మధు మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో లిఖితమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు నిజాం ప్రభువును కూలదోసి తెలంగాణను దేశంలో విలీనం చేశారని కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను మభ్యపట్టేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం ప్రతి ఒక్కరి మదిలోనూ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, కనగాల వెంకటరావు, ఖమర్, సామినేని హరిప్రసాద్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాపు సీతాలక్ష్మి, అనుదీప్, కొట్టి వెంకటేశ్వరరావు, బదావత్ శాంతి తదితరులు పాల్గొన్నారు.