రామవరం, సెప్టెంబర్ 17 : గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. బుధవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కొత్తగూడెం ఏరియాలోని రామవరం టీబీజీకేఎస్ ఆఫీస్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2,412 కోట్లలో 33 శాతం పంచగా 67 శాతం మరలా సింగరేణి సంస్థ డెవలప్మెంట్ కొరకే పక్కన పెట్టారు. ఈ లెక్కన చుస్తే 16.9 శాతం మాత్రమే పంచారు. గత 12 సంవత్సరాల నుండి టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 16 శాతం నుండి 32 శాతం వరకు నికర లాభంలో పంచడం జరిగింది. కానీ ఇప్పుడు తక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా యాజమాన్యం నడుచుకోవడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా గత సంవత్సరం ఆడిట్ షీట్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్నా సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలను తెలియపరచక పోవడం దుర్మార్గమన్నారు. గతoలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరిగినప్పటికీ వాస్తవ లాభాలను తెలియపరచక పోవడం పలు అనుమానాలతో పాటు భారీ ఎత్తున కుట్ర జరుగుతుందని భావించవచ్చన్నారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు క్రిందకు వచ్చే పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ పరిశ్రమ ఉత్పత్తి, ఉత్పాదకతల లాభ నష్టాలను తెలియపరచాల్సి ఉంటుందని, కానీ సింగరేణిలో విచిత్రం ఏమిటంటే ఆరు నెలలు గడిచిన వాస్తవాలను ప్రకటించకపోవడం వింత ప్రక్రియగా మిగిలిపోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చిన నికర లాభాలను ప్రకటించకుండానే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి, నిధులను యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు పక్కన పెట్టి ప్రకటిస్తున్నదన్నారు.
రెండు రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 146.70 కోట్ల రూపాయలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అంతేకాకుండా సిఎస్ఆర్ నిధుల కింద సింగరేణికి సంబంధం లేని సివిల్ ప్రిపేర్ అభ్యర్థులకు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు కోట్లాది రూపాయలను నిబంధనలు విరుద్ధంగా ప్రకటించడం జరిగిందని, ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) సుమారుగా రూ.6,400 కోట్ల లాభాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కావునా యాజమాన్యం వెంటనే వాస్తవ లాభాలు రూ.6,400 కోట్లు ప్రకటించి నికర లాభాల నుంచి ఎటువంటి కటింగ్ లేకుండా 35 శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించి సత్వరమే ఉద్యోగులకు అందజేయాలన్నారు.
దసరా సెలవు అక్టోబర్ 2 నుండి 3వ తేదీకి మార్చాలని, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఈ నెల 22న హైదరాబాద్ నగరంలోని సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని, అప్పటికి ప్రకటన చేయకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించైనా సరే కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు గడప రాజయ్య, నాయకులు వసికర్ల కిరణ్, మురళి, బోరింగ్ శంకర్, ఈశ్వర్, అరుణ్ అశోక్, కుమార్, వెంకటేష్, సూరజ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, అనుదీప్, రాజేష్, శ్రీకాంత్, ఇబ్రహీం పాల్గొన్నారు.