హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలను ముగించాలన్న ఆలోచనతో అధికార పక్షం కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది. గరిష్ఠంగా 10 పని దినాల్లోనే సభను ముగించాలని అధికార పక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులోనే గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించడం తదితర అంశాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి, 29 లేదా 30వ తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేయించి, సభను వాయిదా వేసే విధంగా వ్యూహరచన చేసినట్టు తెలిసింది. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా జాప్యం, సింగరేణి బొగ్గు గనుల అవినీతి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తుది తీర్పు, మూసీ కూల్చివేతలు తదితర అంశాలపై సభలో బీఆర్ఎస్ నిలదీసే అవకాశం ఉన్నదని, ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో బీఆర్ఎస్ సభ్యులు సభలోకి వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వానికి ఉప్పందటంతో ముఖ్యమంత్రి, మంత్రివర్గం అప్రమత్తమైనట్టు తెలిసింది. మార్చి 30 వరకు సభను ముగించాలని నిర్ణయించినట్టు సమాచారం.
సోమవారం ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభమవుతాయి. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీకి తొలిసారి రాబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార నేతృత్వంలో శాఖలవారీగా ఇప్పటికే ప్రీ బడ్జెట్ సమావేశాలు పూర్తి చేశారు. ఈ నెల 20న భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పాత బడ్జెట్లోని లెక్కలను అటూ ఇటూ తిప్పి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలిసింది. గత బడ్జెట్లోని రైతు సంక్షేమం, మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి వంటి పాత పథకాల ప్రస్తావనే బడ్జెట్లో పొందుపరిచారని సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ కింద ఇచ్చిన తులం బంగారం, రూ.4 వేలకు వృద్ధాప్య పింఛన్ పెంపు, 18 ఏండ్లు నిండిన మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం పథకాల ఊసే లేదని విశ్వసనీయంగా తెలిసింది. మహిళలను ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్ మీద గత సంక్రాంతి సమయంలోనే అధికారిక ప్రకటన ఉంటుందని అధికార పార్టీ మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైందని, లేకుంటే చేసేవాళ్లమేనంటూ కొద్దికాలం నెట్టుకొచ్చారు. తీరా బడ్జెట్లో ఆ మూడు పథకాల ప్రస్తావనే ఉండటం లేదని సమాచారం.
సభ్యులు శాసనసభ, శాసనమండలిలో మెలగాల్సిన తీరు మీద ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్ర భుత్వం చేసిన అప్పులు, ఆదాయం, హామీ లు, ఎగవేతలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలో ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలకు శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. సోషి యో ఎకనామిక్ సర్వే, ఆర్బీఐ, కాగ్ లెక్కలను ప్రజలకు అవగతమయ్యే రీతిలో వివరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో తీసుకున్న అప్పులు, ఆదాయం లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను గణాంకాలు సహా వివరించాలని నిర్ణయించారు.
ఆరు గ్యారెంటీలు, ఖమ్మంలో పేదల ఇండ్ల కూల్చివేత, సింగరేణిలో నైనీ కుంభకోణం, మూసీ సుందరీకరణ, గోదావరి నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న ప్రాజెక్టు తదితర అంశాల మీద చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిందని తెలిసింది. యాసంగి ముగుస్తున్నా రైతుభరోసా నిధులు ఇవ్వకపోవడం, సభ నేపథ్యంలో 22న ఒక్క ఎకరానికి ఇస్తామని ప్రకటించడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టు సమాచారం. మహిళలకు రూ .2,500, వృద్ధాప్య పింఛన్లు, తులం బంగారం పథకాల అమలు మీద కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
రెండున్నరేండ్లపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ లేకుండా సమావేశాలు జరుగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సారి కూడా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని కార్యనిర్వాహక అధికారులు చెప్తున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్‌నాయక్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం గత సంవత్సరం జూన్‌లో ప్రకటించింది. ఆయన ప్రస్తుతం విప్‌గా కొనసాగుతున్నారు. రామచందర్‌నాయక్ పేరు ఖరారైనా అధికారికంగా ఉపసభాపతి ఎన్నిక ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. అయితే, ప్రతి సమావేశంలోనూ ఈ నియామకానికి బ్రేక్ పడుతూ వస్తున్నది.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై స్పష్టత లేదు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సమయం లేకపోవడంతో ఎన్నిక నిర్వహించలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రామచందర్‌నాయక్ మంత్రి పదవి అశిస్తున్నారని తెలిసింది. అందుకే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. అట్లాగే అసెంబ్లీలో 18 కమిటీలను నియమించాల్సి ఉండగా, గత రెండున్నరేండ్లుగా దాదాపు 15 కమిటీలను వేయకుండా తాత్సారం చేస్తుండటంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.