ఫ్యాషన్ ప్రపంచాన్ని ఇప్పుడు ‘టోనల్ డ్రెస్సింగ్’ ఏలుతున్నది. ఒకప్పుడు ఫ్యాషన్ అంటే విభిన్న రంగులను కలిపి ధరించడమే అనుకునేవారు. ఇప్పుడు ఆ ఆలోచన మారి ‘టోనల్ డ్రెస్సింగ్’ ట్రెండ్ వైపు అడుగులు వేస్తున్నది. అంటే ఒకే వర్ణానికి చెందిన లేత, ముదురు, మధ్యస్థ ఛాయలను కలిపి ధరించడం. ఈ పద్ధతి దుస్తులకు హుందాతనాన్ని తీసుకురావడమే కాకుండా, మనిషిని మరింత ఆకర్షణీయంగా చూపిస్తున్నదని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పారిస్, మిలాన్, న్యూయార్ ఫ్యాషన్ ప్రదర్శనల్లోనూ ఈ ధోరణి కనిపిస్తున్నది. తెలుపు నుంచి క్రీమ్ వరకు, లేత గోధుమ నుంచి చాక్లెట్ గోధుమ వరకు, ఆకాశ నీలం నుంచి ముదురు నీలం వరకు… ఒకే రంగుకు చెందిన వివిధ ఛాయలను ఒకే దుస్తుల్లో ఉపయోగించడం కొత్త శైలిగా మారింది. ఎలాంటి ఆర్భాటం లేకుండానే హుందాగా కనిపించడం టోనల్ డ్రెస్సింగ్ ప్రత్యేకత.
అందుకే కార్యాలయ సమావేశాలు, అధికారిక వేడుకలు, కుటుంబ కార్యక్రమాలు… ఏ సందర్భానికైనా సులభంగా సరిపోతుందీ ఫ్యాషన్. చీరల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. లేత గోధుమరంగు చీరకు అదే వర్ణానికి చెందిన ముదురు జాకెట్ , లేదా లేత నీలం కుర్తాకు కొద్దిగా ముదురు నీలం దుపట్టా జతచేస్తే ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. ఇక, ఈ ట్రెండ్‌ను అనుసరించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకే రంగు ఎంచుకున్నా, వస్ర్తాల అల్లిక, నేసిన తీరు, వస్త్రపు మెరుపులో స్వల్ప తేడాలు ఉండేలా చూసుకుంటే దుస్తులకు మరింత అందం, ఆకర్షణ వస్తుంది. అందుకే ఇప్పుడు రంగుల కలయిక కంటే, ఒకే రంగును ఎన్ని అందమైన రూపాల్లో చూపించగలమన్నదే ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనంగా మారుతున్నది.