ఖానాపూర్, జూలై 29 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్‌పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది. ఎస్ఐ రహూల్ గైక్వాడ్, స్థానికులు వివరాల ప్రకారం.. పారుబాయి తన భర్త మర్సుకోల మధుతో కలిసి పింఛన్ తీసుకొనేందుకు ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చింది. పింఛన్ తీసుకొన్న అనంతరం భర్త నిత్యావసర సరుకులు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో భారీ వర్షం కురుస్తుండడంతో మధు గ్రామంలోనే ఆగిపోయాడు. భర్త ముందుగానే గూడేనికి వెళ్లిపోయాడని భావించిన పారుబాయి ఒంటరిగా బల్లి వాగు దాటేందుకు ప్రయత్నించింది.
అయితే అప్పటికే వాగులో వరద ఉధృతిగా ప్రవహిస్తుండడంతో ఆమె నీటిలో కొట్టుకుపోయి గల్లంతైంది. వర్షం తగ్గిన అనంతరం మధు గూడానికి చేరుకోగా భార్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో వాగులో గాలింపు చేపట్టారు. కొంతసేపటి తర్వాత పారుబాయి మృతదేహం లభ్యమైంది. పారుబాయికి భర్త మధు, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషాద ఘటనతో చామన్‌పల్లి గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.