ప్రేమికులన్నాక సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు. తామెప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటూ దేవాలయాల బాటా పడుతుంటారు. కానీ, పెళ్లికాని జంట ఈ దేవాలయానికి కలిసి రావొద్దనే ఆనవాయితీ ఉంది. అదే పూరి జగన్నాథ ఆలయం. లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే పూరి జగన్నాథుని రథయాత్ర ఈ నెల 16న మొదలైంది. ఒడిశాలోని పూరిలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. స్వామి వారు స్వయంగా వెలసిన ఈ పూరి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి ప్రకారం.. ఈ ఆలయానికి పెళ్లి కానివారు జంటగా వెళ్లకూడదనే నమ్మకం కూడా ఉంది. స్థానిక కథనాల ప్రకారం పెళ్లికాని వారు జంటగా ఈ ఆలయ గర్భగుడిలోకి అడుగుపెట్టకూడదు. అలా వెళ్తే వారి బంధంలో సమస్యలు వస్తాయని, వారికి వివాహం జరిగే అవకాశాలు తగ్గుతాయని అకడి ప్రజల నమ్మకం.
అందుకే చాలామంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వేర్వేరుగా ఈ ఆలయానికి వెళ్తారు కానీ, జంటగా మాత్రం అస్సలు వెళ్లరు. ఆలయ నిబంధనల్లో అలాంటి రూల్స్ ఏమీ లేకపోయినప్పటికీ ఆ ప్రాంతంలోని ప్రజలు వారి విశ్వాసంగా దీన్ని భావిస్తుండటం విశేషం. పురాణాల ప్రకారం, ఓసారి రాధ.. జగన్నాథుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడిని చూడటానికి పూరి వచ్చిందట. అయితే.. ఆలయంలోకి ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని.. రాధను అకడి పూజారులు లోపలికి అనుమతించలేదట. దీంతో పెళ్లికాని వారు జంటగా వస్తే.. వారు విడిపోతారు అని రాధ శాపం ఇచ్చిందని.. పూరి ప్రజలు నేటికీ నమ్ముతారు. దీనినే ఇప్పటికీ పాటిస్తూ ఉండటం విశేషం. ఇక జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో ఒకటి. ఈ యాత్రలో జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి శ్రీ గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివస్తారు.