ఎకరానికి రూ.7500 ఇస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇంతవరకు ఆ హామీని అమలు చేయకపోగా.. ఇస్తున్న రూ.6వేలనూ సకాలంలో పంపిణీ చేయలేక ఆపసోపాలు పడుతున్నది. నాట్లప్పుడు అందించాల్సిన పెట్టుబడి.. కోతల కాలానికీ ఇవ్వలేకపోతున్నది. సర్కార్ కాలయాపన పథకం అమలుపైనే అనుమానాలను పెంచాయి.
యాసంగి రైతుభరోసా పంపిణీ చేసేందుకు ఎట్టకేలకు మరో తేదీని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. అయితే పెట్టుబడిని మూడు వాయిదాల్లో చెల్లిస్తామన్న ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22న తొలి విడత నిధులను జమ చేయనున్నది. రైతులు అందరికీ ఒక ఎకరం చొప్పున మాత్రమే విడుదల చేయనున్నది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు తొలి విడత డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నిధులను ఒకేసారి విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే విధానం అనుసరించింది. గత వానకాలంలో తొమ్మిది రోజుల్లోనే అందరికీ రైతుభరోసా నిధులు జమ చేశామని కాంగ్రెస్ సర్కా ర్ ఘనంగా ప్రకటించింది. కానీ, ఈసారి కొత్త విధానం తెర మీదకు తెచ్చింది.
గతం లో ఒక్కో రైతుకు ఎంత వ్యవసాయ భూమి ఉంటే అంత భూమికి ఒకేరోజు రైతుభరోసా జమ చేసేవారు. కానీ, ఈసారి పాత విధానానికి విరుద్ధంగా, ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ, తొలి విడతగా ఒక ఎకరం వరకు మాత్రమే ఇ వ్వాలని నిర్ణయించింది. అంటే ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా మొదటిరోజు రూ.ఆరు వేలు మాత్ర మే జమ చేయనున్నది. ఈ కొత్త విధానంపై రైతుల్లో తీవ్ర భయాందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసా లో కోతలు పెట్టేందుకు ఈ విధానం తీసుకొచ్చారనే అనుమానాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు. రైతులందరికీ 3 నుంచి 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధు లు పంపిణీ చేసి మిగిలిన ఎకరాలకు ఎగ్గొట్టే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుభరోసా పంపిణీపై సర్కార్ ప్రకటనలు, చర్యలను గమనిస్తే, ఈ యాసంగిలోనూ రైతుభరోసాకు కోతలు పెట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సర్కార్‌కు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలనే సదుద్దేశమే ఉంటే మొన్నటి వానకాలం మాదిరిగా ఒకేసారి పంపిణీ చేసేదని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, తొలుత ఈ సీజన్లో రైతుభరోసా పంపిణీ ని పూర్తిగా ఎగ్గొట్టాలనే ఆలోచనకు సర్కార్ పెద్దలు వచ్చారని తెలిసింది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఒక్కసారి రూ.9వేల కోట్లు పంపిణీ చేస్తే రాష్ట్ర ఖజనా ఖాళీ అవుతుందనే ఆలోచన చేశారని సమాచారం. రైతుభరోసా పంపిణీలో తీవ్ర జాప్యం జరగడంతో ఆగ్రహించిన రైతులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
మరోవైపు, సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతుభరోసాపై సర్కార్‌ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. ఒకవేళ సభలో రైతుభరోసాపై రచ్చ జరిగితే, ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనే భ యంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసిం ది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రైతుభరోసాపై చర్చ, ఆందోళనలు జరగకుండా నివారించేందుకు మూడు విడతల విధానం తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లేనిపక్షంలో తొలి విడతకు తేదీని ప్రకటించిన సర్కార్.. ఆ తర్వాతి రెండు విడతల తేదీలను ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రెండో విడతకు 20 రోజుల సమయం పె ట్టింది. అంటే అప్పటికే అసెంబ్లీ సమావేశా లు ముగిసిపోతాయి. ఆ తర్వాత రాజు ఎవ రో.. రెడ్డి ఎవరో.. అన్నట్టుగా సర్కార్ ఆలోచన చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఇది ఐదో సీజ న్. ఇందులో ఒకే ఒక్క సీజన్లో మొన్నటి వానకాలానికి మొత్తం భరోసా పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలి విడత యాసంగికి కేసీఆర్ జమ చేసిన నిధులనే పంపిణీ చేసింది. ఆ తర్వాత వానకాలంలో రైతులకు నయా పైసా ఇవ్వలేదు. ఆ తర్వాత యాసంగిలో మూడెకరాల వర కు మాత్రమే పంపిణీ చేసింది. మిగిలిన రైతులకు ఎగనామం పెట్టింది. తాజాగా యాసంగిలో ఎవరికి ఇస్తుందో, ఎన్ని ఎకరాలకు ఇస్తుందో తెలియని అయోమయం నెలొన్నది. గత అనుభవాలను పరిశీలిసే,్త ఈ యాసంగి సీజన్లో మూడెకరాల వరకు పంపిణీ చేసి మమ అనిపిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు విడతల్లో రైతులందరికీ రైతుభరోసా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుభరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
ఈ నెల 22న సుమారు 70 లక్షల మంది రైతులకు ఒక ఎకరం రైతుభరోసా కింద రూ.3,590 కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతగా 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిందే తప్ప, కచ్చితమైన తేదీ వెల్లడించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత పంపిణీ చేస్తామని పేర్కొన్నది. ఈ విధంగా చివరి రెండు విడతలకు ప్రభుత్వం స్పష్టమైన తేదీలను ప్రకటించకపోవడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ, మిగిలిన రెండు విడతల్లో ఎన్ని ఎకరాల వరకు, ఎంతమంది రైతులకు పంపిణీ చేస్తుందనే విషయాన్ని ప్రకటించలేదు. దీంతో ఈ సీజన్ రైతుభరోసా పూర్తిగా పంపిణీ చేస్తుందా? లేక గతంలో మాదిరిగానే కొంతమందికి పంపిణీ చేసి మమ అనిపించేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.