మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 15: అత్తాపూర్ రాంబాగ్‌లోని ఓ ప్రభుత్వ స్థలంలో బ్లూ షీట్స్ వేసి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేతలు నిర్వహించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. అత్తాపూర్ డివిజన్ రాంబాగ్ సర్వే నంబర్ 354/1, 354/4లో 6,040 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది తమది అంటూ సిక్కు సమాజానికి చెందిన కొందరు బ్లూ షీట్స్‌తో ఇటీవల రాత్రికి రాత్రి ప్రహరీని నిర్మించారు. విషయం తెలుసుకున్న హైదర్‌గూడ, అత్తాపూర్, ఉప్పర్పల్లితో పాటు ప్రణవ భక్త సమాజం సభ్యులు సంబంధిత ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో పాటు హైడ్రా కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నాలుగు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివాదాస్పద భూముల వద్దకు వచ్చి ఇరువర్గాల పత్రాలతో పాటు వివరాలను సేకరించారు. విచారణ అనంతరం బ్లూషీట్లో వేసిన ప్రహారీని తొలగించాలని ఆయన ఆదేశించారు. ఆదివారం హైడ్రా అధికారులు సంబంధిత స్థలంలోని బ్లూ షీట్స్‌ను తొలగించడంతో ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలంగా బోర్డు ఏర్పాటు చేశారు.దీంతో సిక్కు సామాజిక వర్గానికి చెందినకొందరు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. తమ స్థలం కూల్చివేస్తే ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.