మన్సూరాబాద్, మార్చి 15: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 23, 24, 25 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న చేనేత కార్మిక సంఘం రిలే నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, కార్యదర్శి ముషం నరహరి ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. నిరాహార దీక్షలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయనకు అందజేశారు.
సంఘం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చేనేత భరోసా పథకం అమలు చేయడం లేదని, త్రిఫ్ట్ పథకంలో భాగంగా బ్యాంకుల్లో చేనేత కార్మికులు జమ చేస్తున్న, ప్రభుత్వం నుంచి జమ చేయాల్సిన డబ్బులను 9 నెలలుగా బ్యాంకుల్లో జమచేయడం లేదని తెలిపారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ సమస్యలను తెలిపే విధంగా దీక్ష చేపడు తున్నామన్నారు. దీక్షా శిబిరాన్ని తప్పకుండాసందర్శిస్తానని హరీశ్ రావు హామీనిచ్చినట్లు సంఘం అధ్యక్షుడు వనం శాంతికుమార్ తెలిపారు.