సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాంకీ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ చేపడుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ నాయకులు కార్మికులు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం జీహెచ్ఎంసీ యూనియన్ ప్రెసిడెంట్ కత్రావత్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ…తాము పనిచేసే ప్రాంతాల్లో రాంకీ సంస్థ యూపీ బండ్లతో చెత్తను సేకరిస్తున్నదన్నారు. తమ ఏరియాలోకి రాంకీ వాహనాలు వచ్చి చెత్త తీసుకెళ్తుండటంతో కార్మికుల మధ్య అనవసర వివాదాలు, గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 పాత జీవో ప్రకారం ఒకరి పొట్ట కొట్టి మరొకరికి ఉపాధి కల్పించవద్దనే నియమం ఉన్నప్పటికీ, రాంకీ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో హంసరాజు, అర్జున్, లక్ష్మణ్, రాము, రమేశ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.