రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ): ట్రిపుల్ ఆర్ బాధితుల ఆందోళన తో సాగర్ రోడ్డు దద్దరిల్లింది. రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులు బుధవారం హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై అన్నెబోయినపల్లి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, బీఆర్ఎస్ మాడ్గుల మండల నాయకుడు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మాడ్గుల మండలంలోని అన్నెబోయినపల్లి, కొత్తబ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, మాడ్గుల, నల్లచెరువు, కలకొండ, చండ్రాయన్పల్లి గ్రామాల నుంచి బాధిత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అన్నెబోయినపల్లి గేటు వద్దకు చేరుకున్నారు. సాగర్ రోడ్డుపైకి రావడానికి ప్రయత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు వలయాన్ని ఛేదించుకుని సాగర్ రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. పోలీసులు వెంటనే వారిని బలవంతంగా అరెస్టుచేసి వ్యాన్లలో ఎక్కించారు. పోలీసులు, రైతులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి యాద య్య, రైతు నాయకులు, బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా అరెస్టుచేసి యాచారం పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పెద్దల కోసం పేద రైతులను బలిచేస్తారా? : జైపాల్‌యాదవ్
ముఖ్యమంత్రి బంధువులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పేద రైతులను బలిచేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. సాగర్ రోడ్డుపై ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీజనల్ రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు తయారుచేసిందని, అప్పట్లో రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బంధువుల భూములు కాపాడటం కోసం అలైన్‌మెంట్‌ను మార్చిందని విమర్శించారు. మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫారూక్‌నగర్, కేశంపేట, కొందుర్గు మండలాలకు చెందిన వేలాదిమంది సన్న,చిన్నకారు రైతుల భూములు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు చేపట్టాలని, అప్పటివరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
గుడిమల్కాపురంలో ట్రిపుల్ఆర్ బాధితుల ఆందోళన పెద్దల భూముల కోసమే అలైన్మెంట్ మారిందని ఆవేదన
బడాబాబుల భూములు కాపాడటం కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి పేద రైతుల భూములు గుంజుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం వద్ద చౌటుప్పల్- నారాయణపురం వెళ్లే రహదారిపై బైఠాయించారు. ఎస్సై జగన్ వచ్చి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.