Union Govt : ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ 8వ తరగతి సోషల్ పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను తాము సహించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. వివాదాస్పదమైన ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అలాంటి అంశాలను చేర్చకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తంచేశాయి. అవి ఆమోదయోగ్యమైనవి కావని, వాటి స్థానంలో స్ఫూర్తిదాయక అంశాలు చేర్చాల్సిందని అభిప్రాయపడ్డాయి.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.