PM Modi : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఇరువురు ప్రధానులు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, అధికారులు, సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం రెండు దేశాలకు చెందిన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ పర్యటన సమయంలో మోదీ పాకెట్లో కాషాయ రంగు స్క్వేర్ ఉండటం, అలాగే నెతన్యాహు భార్య సారా కూడా కాషాయ రంగు ధరించడంపై నెతన్యాహు ఛలోక్తులు విసిరారు. మోదీని రిసీవ్ చేసుకోవడం కోసం నెతన్యాహు ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించడం విశేషం. ఇజ్రాయెల్ చేరుకోవడంపై మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నెతన్యాహు, ఆయన భార్య తనకు స్వాగతం పలకడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలు, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు రోజులపాటు మోదీ, నెతన్యాహు కీలక అంశాలపై చర్చిస్తారు. అలాగే, చర్చలు, ఒప్పందాల అనంతరం రెండు దేశాధినేతలు కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. మరోవైపు స్థానిక కింగ్ డేవిడ్ హోటల్లో ప్రధాని మోదీ భారతీయులతో సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మోదీ కోసం నెతన్యాహు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.