ఆరుగాలం పనిచేసి పంట పండించాల్సిన రైతులు యూరియా కోసం అరిగోస పడుతూ యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కర్షకులు రైతు వేదికలు, వ్యవసాయ సంఘాల వద్దకు చేరుకొని చెప్పులను క్యూలో పెట్టారు. పెద్దఎత్తున రైతులు తరలిరావడంతో పలుచోట్ల తోపులాట జరిగింది.
ప్రభుత్వం యూరియా సక్రమంగా అందించాలని రైతులు వేడుకుంటున్నారు. యూరియా కోసం టోకెన్లు ఇచ్చి రోజుల తరబడి తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సరైన సమయంలో పంటకు యూరియా వేయకుంటే దిగుబడి రాదని ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం వెళ్తుండగా మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
బయ్యారం సెప్టెంబర్ 17: యూరియా కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో పది మంది రైతులకు గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురిమళ్ల గ్రామానికి చెందిన రైతులు యూరియా కోసం తెల్లవారుజామున ఉప్పలపాడుకు ఆటోలో బయలుదేరారు. గురిమళ్ల-కంబాలపల్లి గ్రామాల మధ్య ఆటో బోల్తా కోట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో డ్రైవర్‌తో పాటు 12 మంది ఉండగా, 10 మందికి గాయాలయ్యాయి.
వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వీరిని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు పరామర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట మండల అధ్యక్షుడు తాత గణేశ్, గంగుల సత్యనారాయణ, మురళీకృష్ణ, శ్రీను, వజ్జా భద్రయ్య, రామారావు ఉన్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో గంటల తరబడి క్యూలో నిల్చున్నా యూరియా ఇవ్వకపోవడంతో ధర్నా చేస్తున్న రైతులు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(టీ) మండల కేంద్రంలో బుధవారం రైతువేదికలో నోటీసు బోర్డులో తమ పేర్లను వెతుక్కుంటున్న రైతులు
అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం, పత్తి గింజల కోసం లైన్లు కట్టినం. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. పంట సాగుకు మేం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి తెలుస్తలేదు. మా లాగా ఒక రోజు నాగలి పడితే, రోజంతా లైన్లో నిలబడితే అప్పుడు మా బాధ తెలుస్తది. ఉదయం 6గంటలకు వచ్చి సాయంత్రం 7గంటలకు ఇంటికి పోతున్నం. రైతుబంధు ఇయ్యలే, సన్న వడ్లకు బోనస్ ఇయ్యలే. రేవంత్‌రెడ్డి ఏ మేమో చేస్తనన్న డు.. ఏమీ చేస్తలే డు. మా రైతులను అరిగోస పెడుతున్నడు. ఈ సారి ఓట్లు అడిగేందుకు రా వాలి…అప్పుడు చెప్తం.. కాంగ్రెసోళ్ల సంగతి.
నల్లగొండ జిల్లా త్రిపురారం యూరియా కోసం రైతు వేదికకు వచ్చి చెప్పులు క్యూలో పెట్టి, ఆవరణలో కూర్చున్న మహిళా రైతులు
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం నిద్రిస్తున్న రైతులు